రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో దక్షిణాదికి అన్యాయం? ఇంగ్లీష్‌కి కూడా అవకాశం ఇవ్వాలి
దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ప్రముఖ క్విజ్ కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’లో దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని, హిందీ మాట్లాడలేని వారికి ఇంగ్లీషులో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొరె మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన అనుభవాన్ని, గణాంకాలను వివరించారు.
‘కేబీసీ’లో పాల్గొనే అభ్యర్థులకు హిందీతో పాటు ఇంగ్లీషులో కూడా మాట్లాడే వీలు కల్పించాలని, దక్షిణ భారతదేశ అభ్యర్థులకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతూ ఆయన ప్రజావినతులు, ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తి హిందీ భాషకు వ్యతిరేకం కాదని, హిందీ గౌరవనీయమైన భాషేనని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనగలిగే స్థాయి ఉన్న అనేక మంది కేవలం హిందీలో మాట్లాడలేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆయన సూచించారు. అలాంటి వారికి కనీసం ఇంగ్లీషులోనైనా మాట్లాడే అనుమతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఐక్య భారతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకునే ఈ కార్యక్రమంలో హాట్‌సీటులో కూర్చునే వారికి హిందీతో పాటు ఇంగ్లీష్‌ను ఎందుకు అనుమతించకూడదని ప్రశ్నించారు.
కేబీసీ ప్రక్రియలో రిజిస్ట్రేషన్, ప్రశ్నలు, జవాబుల ఎంపికలు, స్క్రీన్‌పై కనిపించే నియమ నిబంధనలన్నింటికీ ఇప్పటికే ఇంగ్లీష్ వాడుతున్నారని, అలాంటప్పుడు అభ్యర్థులకు కూడా ఇంగ్లీషులో మాట్లాడే వీలు కల్పించడం సముచితమని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడలేని ఎందరో అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందగలరని చెప్పారు.
కేబీసీ నిర్వాహకులు వెల్లడించిన సమాచారం ప్రకారం జోన్ల వారీగా ప్రాతినిధ్య శాతాలను ఆయన ప్రస్తావించారు. జోన్ 1 (ముంబై, ఢిల్లీ)కి 21 శాతం, జోన్ 2 (గుజరాత్, దమన్ & డయ్యూ, నగర్ హవేలి)కి 12.60 శాతం, జోన్ 3 (మహారాష్ట్ర–ముంబై మినహా, గోవా)కి 13.20 శాతం, జోన్ 4 (పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ & కశ్మీర్, లడఖ్, రాజస్థాన్)కి 12.20 శాతం, జోన్ 5 (మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్)కి 12 శాతం, జోన్ 6 (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్)కి 15 శాతం, జోన్ 7 (పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు)కి 11.50 శాతం ప్రాతినిధ్యం ఉండగా, జోన్ 8కి కేవలం 2.50 శాతం మాత్రమే ఉందని ఆయన వివరించారు.
జోన్ 8లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ & నికోబార్ దీవులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ప్రాంతానికి ఇంత తక్కువ శాతం ప్రాతినిధ్యం ఉండటం ద్వారా ఈ జాతీయ కార్యక్రమంలో ప్రాంతీయ సమతౌల్యం, సమాన అవకాశాలు లేవని స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందీ మాట్లాడని ప్రాంతాల ప్రేక్షకుల మద్దతుతోనూ ఈ కార్యక్రమం నడుస్తున్నందున అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించే బాధ్యత నిర్వాహకులపై ఉందని సూచించారు.
కోల్‌కత్తాలో జరిగిన కేబీసీ సీజన్–15 ఆడిషన్ సందర్భంగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని కూడా కొరె మల్లికార్జునరావు వివరించారు. 70 ఏళ్ల వయస్సులో భార్యతో కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినప్పుడు ఎంపిక ప్రక్రియలో కొన్ని దశల్లో ఇంగ్లీష్ వాడినప్పటికీ, ఎక్కువ భాగం హిందీలోనే మాట్లాడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆయన తెలిపారు.
ఈ సమస్యలపై ఆయన 2025 మార్చి 13న ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రజావినతి పంపగా, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 2025 మార్చి 28న పంపిన సమాధానంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ నియమాల ప్రకారం నేరుగా బ్రాడ్‌కాస్టర్‌ను సంప్రదించవచ్చని సూచించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ జోన్ 8 ప్రాతినిధ్య లోపం, ఇంగ్లీష్‌లో మాట్లాడే అవకాశంలేకపోవడం వంటి సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మూడు ప్రధాన సూచనలు చేశారు. హిందీలో మాట్లాడలేని అర్హులైన అభ్యర్థులకు ఇంగ్లీషులో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలని, జోన్ 8 ప్రాతినిధ్యాన్ని పునఃసమీక్షించాలని, దక్షిణ భారతదేశ అభ్యర్థుల సౌకర్యార్థం ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో కనీసం ఒక ఆడిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజాహిత దృష్టితో చేసిన ఈ వినతిపై కార్యక్రమ నిర్వాహకులు సానుకూలంగా స్పందించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







