రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ‘క’, ‘కే-ర్యాంప్’ సినిమాల తర్వాత తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం భారీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం వెల్లడించారు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందన అందుకుంటున్న ‘చెన్నై లవ్ స్టోరీ’లో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్ల సందర్భంగా వెబ్ సిరీస్‌ల గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన కిరణ్ అబ్బవరం, తాను ఇప్పటికే ఒక భారీ ప్రాజెక్ట్ పూర్తి చేసే దశలో ఉన్నట్లు తెలిపారు.
‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతోంది. ఇది చాలా పెద్ద వెబ్ సిరీస్‌గా ఉండబోతుందని, ప్రేక్షకులు ఖచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారని కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని, మరో పది రోజుల్లో మొత్తం చిత్రీకరణ ముగుస్తుందని ఆయన వెల్లడించారు.
ఇది వరకు నాలుగు నెలల క్రితమే ‘గువ్వల చెరువు ఘాట్’ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను పరిశీలిస్తే, ఈ కథ పొలిటికల్, యాక్షన్, రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగేలా రూపుదిద్దుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
దక్షిణ భారతదేశంలోని గువ్వల చెరువు అనే ఫ్యూడల్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో, మొదట సాధారణ ఫొటోగ్రాఫర్‌లా కనిపించే కిరణ్ అబ్బవరం పాత్ర తరువాత ఊహించని మలుపులు తిరుగుతుందని సమాచారం. డ్రీమ్ ఫార్మర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదర ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సిరీస్‌తో సంయుక్త మీనన్ ఓటీటీ అరంగేట్రం చేయడం మరో విశేషం. తిరువీర్, తేజస్వీ రావు, సిద్ధిక్, ఆడుకలం నరేన్, వికాస్ దర్శన్, మహర్షి విద్యా, మంజు భార్గవి, వినోద్ కిషన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ‘గువ్వల చెరువు ఘాట్’ విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయన ఓటీటీ ఎంట్రీ కూడా సినిమాల మాదిరిగానే విజయవంతమవుతుందా లేదా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.







