రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హోస్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న టాక్ షో ‘మెగా వర్స్’పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 13 ఎపిసోడ్‌లతో ఈ షో తొలి సీజన్ రూపొందుతున్నట్టు సమాచారం. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌ల షూటింగ్ పూర్తయిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ‘మెగా వర్స్’ అనే పేరుకు నిజమైన అర్థం వచ్చేలా ఒక ప్రత్యేక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తొలి సీజన్ ముగింపు ఎపిసోడ్‌ను మెగా ఫ్యామిలీ అంతా కలిసేలా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మెగా లోకం మొత్తం ఒకే వేదికపై కనిపించేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్.

ఈ ఎపిసోడ్‌లో నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. సాధ్యమైతే సాయిధరమ్ తేజ్, నిహారిక, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్‌ను కూడా ఏదో రూపంలో ఈ ఎపిసోడ్‌లో భాగం చేయాలని యోచిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా అందరూ ఒకే ఎపిసోడ్‌లో కనిపిస్తే, టాలీవుడ్‌లో ఇంతవరకు చూడని భారీ ఫ్రేమ్‌ను ఓటీటీలో చూడబోతున్నట్టే అవుతుందని పరిశ్రమలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యంతో సుస్మిత కొణిదెల కృషి కొనసాగుతోంది. ఆమె ఈ షోకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే బ్రహ్మానందం – సునీల్ – సత్యలతో కూడిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా కమల్ హాసన్‌తో కూడిన ఎపిసోడ్‌ను కూడా చిత్రీకరించినట్టు సమాచారం. మరికొందరు ప్రముఖులు కూడా ఈ షో కోసం సిద్ధమవుతున్నారని టాక్ ఉంది.
ప్రారంభంలో ఈ టాక్ షోలో కేవలం సినిమా ప్రముఖులే కాకుండా ఇతర రంగాల ప్రముఖులను కూడా ఆహ్వానిస్తారని చెప్పినప్పటికీ, ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఎక్కువగా సినిమా సెలబ్రిటీల గురించే ఉంది. మరో వారంలో షోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దీపావళి సందర్భంగా ‘మెగా వర్స్’ ప్రోమో విడుదల చేయాలనే ప్రణాళికలో ఉన్నారని సమాచారం. 192 దేశాల్లో ఈ టాక్ షో ప్రసారం కానున్న నేపథ్యంలో, విడుదలకు ముందే మంచి చర్చనీయాంశంగా మారితే, ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు గణనీయమైన గుర్తింపు లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






