లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి దేవత పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2020లో జియోహాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా విడుదలై మంచి స్పందన పొందిన ‘మూకుతి అమ్మన్’కు సీక్వెల్‌గా ‘మూకుతి అమ్మన్ 2’ రూపొందుతోంది. దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కుల విషయంలో పెద్ద వార్త బయటకు వస్తోంది. ‘మూకుతి అమ్మన్ 2’ ఓటీటీ హక్కులను జియోహాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అందుతున్న వివరాల ప్రకారం చిత్రబృందం, జియోహాట్‌స్టార్‌తో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంతన్నది అధికారికంగా వెల్లడికాలేదు. మొత్తాన్ని బయటపెట్టకపోయినా, ఇది మంచి ఫ్యాన్సీ రేటుకే వెళ్లినట్లు పరిశ్రమలో వినిపిస్తున్న మాట.

ఈ సీక్వెల్‌లో నయనతార మరోసారి అమ్మన్ (అమ్మోరు తల్లి) పాత్రలో కనిపించనుండగా, ఈసారి కథలో ప్రతినాయకురాలిగా రెజీనా కసాండ్రా నటిస్తున్నట్లు సమాచారం. సుందర్ సి తనదైన శైలిలో ఫాంటసీ, కామెడీ, సామాజిక వ్యంగ్యాన్ని కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది.

‘మూకుతి అమ్మన్ 2’ 2020లో వచ్చిన ‘మూకుతి అమ్మన్’కు నేరుగా సీక్వెల్‌గా వస్తోంది. మొదటి భాగానికి ఆర్.జే. బాలాజీ, ఎన్.జే. శరవణన్ దర్శకత్వం వహించారు. నయనతార దేవత పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ‘మూకుతి అమ్మన్’ (అమ్మోరు తల్లి) కథ ఒక పేద లోకల్ రిపోర్టర్ ఎంగెల్స్ రామస్వామి (RJ బాలాజీ) కుటుంబ కష్టాల చుట్టూ తిరుగుతుంది. వారి కష్టాలు తీర్చడానికి వారి కులదైవమైన మూకుతి అమ్మన్ (నయనతార) మానవ రూపంలో భూమిపైకి వస్తుంది.

అయితే అమ్మవారు కేవలం ఆ ఒక్క కుటుంబం కోసమే కాకుండా, దేవుడి పేరుతో ప్రజలను మోసం చేస్తూ 11,000 ఎకరాల పేదల భూమిని లాక్కోవాలని చూస్తున్న ‘భగవతి బాబా’ అనే నకిలీ గాడ్‌మ్యాన్ అక్రమాలను అరికట్టడానికి వస్తుంది. అమ్మవారు తన దైవశక్తితో కాకుండా, ఎంగెల్స్ టీవీ ఛానల్ ద్వారా బాబా మోసాలను సాక్ష్యాధారాలతో ప్రజల ముందుంచి అతని అసలు రూపాన్ని బయటపెడుతుంది. దేవుడు మన నమ్మకంలోనే ఉన్నాడని, గుడ్డిగా మోసగాళ్లను నమ్మవద్దనే మంచి సామాజిక సందేశంతో కథ ముగుస్తుంది.

నకిలీ ఆధ్యాత్మిక గురువులను వ్యంగ్యంగా బట్టబయలు చేసిన ఈ కథ అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా సోషల్ మెసేజ్‌ను కామెడీ స్టైల్‌లో చూపించిన తీరు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. మొదటి భాగంలో నయనతారతో పాటు ఆర్.జే. బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, అభినయ, మౌళి, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ ‘మూకుతి అమ్మన్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇప్పుడు రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నయనతార చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యష్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 2026 ఆగస్టు 26న విడుదల కానుంది. అలాగే కెవిన్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘హాయ్’ కూడా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ‘మూకుతి అమ్మన్ 2’ ఓటీటీ డీల్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, దేవత పాత్రలో నయనతార మరోసారి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో చూడాలనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో పెరుగుతోంది.