రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అఖిల్ వివిధ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇటీవల విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మా ఇంటి బంగారం’ గురించి మాట్లాడారు. ఈ సినిమా చాలా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ‘లెనిన్’ ప్రమోషన్లలో నిమగ్నమై ఉండటంతో ఇంకా ‘మా ఇంటి బంగారం’ పూర్తి సినిమా చూడలేకపోయినప్పటికీ, ట్రైలర్ మాత్రం చూసినట్టు తెలిపారు.
‘‘లెనిన్ ప్రమోషన్స్‌లో ఉండడంతో నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ, ఆ చిత్ర ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఆ సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. చిత్రం చాలా సహజంగా అనిపించింది. మంచి ఇంటికి కోడలిగా వెళ్లి వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే అంశంతో పాటు, పవర్‌ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళా పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ సామ్’’
అని అఖిల్ పేర్కొన్నారు. సమంతతో పాటు మొత్తం చిత్రబృందానికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘మా ఇంటి బంగారం’లో సమంత పోషించిన పాత్ర, ఆమె నటన తనను బాగా ఆకట్టుకున్నాయని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక సమంత విషయానికి వస్తే, జూన్ నెల తనకు ప్రత్యేకంగా అనిపించిందని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అద్భుతమైన కథ’ అంటూ జూన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ జూన్‌లోనే విడుదలై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.
ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ సేల్స్ ఫొటోలతో పాటు, ప్రెగ్నెన్సీ సమయంలో తాను చేసిన వర్క్‌వుట్‌ల వీడియోను కూడా సమంత అభిమానులతో షేర్ చేశారు. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్న సమంతకు, సహనటుడు అక్కినేని అఖిల్ నుంచి వచ్చిన ఈ అభినందనలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.







