పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘OG’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల ఆకాంక్షలను ఈ చిత్రం గణనీయంగా తీర్చినట్టు సినీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విజయానంతరం ‘OG’కు సీక్వెల్‌గా ‘OG2’ను అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహం నెలకొంది.

అయితే తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే పవర్ స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీగా భావిస్తున్న ‘OG2’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి, దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్ కారణంగా ఈ ఆలస్యం తప్పదని ఫిల్మ్ నగర్ టాక్.

పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే మరో భుజానికి కూడా ఆపరేషన్ జరగాల్సి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నుంచి ఏడునెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయన కొంతకాలం పాటు నటనకు పూర్తిగా దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక మరోవైపు, ‘OG’ దర్శకుడు సుజీత్ ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని లైన్లో పెట్టారు. ‘OG’ విడుదలకు ముందే నేచురల్ స్టార్ నానీతో ‘బ్లడీ రోమియో’ అనే కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

‘బ్లడీ రోమియో’ చిత్రీకరణ పూర్తిగా ముగిసిన తర్వాతే సుజీత్ ‘OG2’ పనులపై దృష్టి సారించనున్నారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రికవరీ సమయం, నానీతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మధ్య గ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటే ‘OG2’ షూటింగ్ 2027 రెండోార్ధంలోనే మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ లెక్కల ప్రకారం దాదాపు ఏడాది కంటే ఎక్కువ గ్యాప్ తర్వాతే పవర్ స్టార్ సినిమా మళ్లీ సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ‘OG’ సక్సెస్‌తో హుషారులో ఉన్న అభిమానులకు ‘OG2’ ఆలస్యం నిరాశ కలిగించినప్పటికీ, పెద్ద స్థాయి ప్రాజెక్ట్ కావడంతో ఓపికగా ఎదురుచూడాల్సిందేనని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.