రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రిలీజ్ రెండో రోజుకే ‘పెద్ది’ పైరసీ షాక్
– HD ప్రింట్ ఆన్లైన్లో లీక్
టాలీవుడ్‌ను ఇబ్బంది పెట్టుతున్న పైరసీ మళ్లీ మరోసారి బారి చూపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా కూడా ఈ సమస్యకు అతీతం కాలేకపోయింది. రిలీజ్‌కు ముందు పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఈ చిత్రానికి హెచ్డీ క్వాలిటీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం నిర్మాతలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే తెలుగు చిత్రసీమలో పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని చర్యలు తీసుకున్నా, కొత్త సినిమాలు మంచి క్వాలిటీలో పైరసీ సైట్లలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. దీని ప్రభావం థియేటర్లపై తీవ్రంగా పడుతోంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా రాకపోతే థియేటర్లు నిలబడే పరిస్థితి లేదని రంగ నిపుణులు చెబుతున్నారు. పైరసీ కారణంగా పెద్ద సినిమాల కలెక్షన్లు గణనీయంగా దెబ్బతింటున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో విడుదలైన దాదాపు ప్రతి సినిమాకూ పైరసీ ప్రింట్లు అందుబాటులోకి రావడం అలవాటైపోయింది. థియేటర్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే పైరసీ ప్రింట్ చూసి సినిమాపై అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చిత్ర బృందాలు రిలీజ్‌కు ముందే యాంటీ పైరసీ చర్యలు చేపట్టినా, ఫలితం పెద్దగా కనిపించడం లేదు. అదే పరిస్థితి ‘పెద్ది’ విషయంలోనూ కనిపించింది.
రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు నుంచే ఈ సినిమా చుట్టూ నడిచిన వివాదాలు, కోర్టు వరకు వెళ్లిన పరిణామాలు అందరికీ తెలిసిందే. చివరకు అడ్డంకులు తొలగి సినిమా విడుదల కాగా, మరోవైపు పైరసీ రూపంలో కొత్త సమస్య నిర్మాతలను వేధిస్తోంది.
‘పెద్ది’ విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించినట్లు సమాచారం. రెండో రోజున కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తున్న సమయంలోనే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో దర్శనమివ్వడం పెద్ద దెబ్బగా మారింది. కొన్ని సైట్లలో ఈ ప్రింట్ అందుబాటులో ఉందని, సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ దృష్టికి తీసుకెళ్తున్నారు. పైరసీ ప్రింట్ లీక్‌పై నిర్మాతలు, చిత్ర బృందం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, చిత్రంలోని కొన్ని సన్నివేశాలను విడిగా కట్ చేసి యూట్యూబ్ , ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో కొందరు అప్లోడ్ చేస్తున్నారని సమాచారం. పైరసీ మాఫియాపై కఠిన చర్యలు, అక్రమ లీకులకు అడ్డుకట్ట అవసరమన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.







