రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: కోలీవుడ్‌లో దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ తమ తదుపరి సినిమాల విషయంలో ప్రాధాన్యతలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్క్రిప్ట్ ఎంపిక, దర్శకుల మార్పులతో రెండు స్టార్‌ల ప్రాజెక్టులు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.
రజనీకాంత్ 173వ చిత్రంపై గత కొంతకాలంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట సుందరి సి కథను వినిపించగా, ప్రారంభ దశలో రజనీ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌కు చేరేసరికి తలైవర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తర్వాత సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌కు అనుసంధానమయ్యాడని వార్తలు వచ్చాయి. భారీ స్థాయిలో, విస్తృతమైన స్కేల్‌లో కథను తెరకెక్కించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఈ కలయిక కూడా అమలులోకి రాలేదని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
చివరికి అశ్వత్ మారిముత్తు కొత్త కథతో ముందుకు రావడంతో రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘ధర్మన్’ పేరుతో రూపుదిద్దుకుంటోంది. రజనీ 173గా భావిస్తున్న ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని కోలీవుడ్ టాక్.
ఇక కమల్ హాసన్ 237వ ప్రాజెక్ట్ కూడా ఇలాగే మార్పులు సంతరించుకుంటోంది. ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, కమల్ తన తదుపరి యాక్షన్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో ఒక చిత్రానికి కమల్ అవకాశం ఇచ్చినట్లు, ఈ మూవీని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించినట్లు సమాచారం.
తమిళనాడు ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఇటీవల కమల్ హాసన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని టెక్నీకల్ సమస్యలు, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా ఈ చిత్రం ముందుకు సాగడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టైమ్ వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో కమల్ మరో దర్శకుడిని లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘చిన్నా’ ఫేమ్ ఎస్ యు అరుణ్ కుమార్ చెప్పిన కథకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. గత ఏడాది ‘వీర ధీర శూరన్’తో ఓకే అనిపించుకున్న ఈ దర్శకుడు, తాజాగా కమల్ హాసన్‌తో కలయికకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం కమల్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలకు కమిట్ అయ్యాడు.
కమల్ హాసన్ ప్రస్తుతం ‘కల్కి 2’తో పాటు రజనీకాంత్‌తో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే సమయంలో ‘సియోన్’, ‘ధర్మన్’ చిత్రాలను కూడా నిర్మిస్తున్నాడు. ఈ వరుస ప్రాజెక్టులతో కమల్, రజనీ ఇద్దరూ కోలీవుడ్‌లో తమ తదుపరి దశకు సన్నద్ధమవుతున్నారు.







