బాలీవుడ్‌లో అత్యధిక పారితోషం

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా పెళ్లి తరువాత బాలీవుడ్‌లో దూకుడు పెంచింది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన ఈ శ్రీవల్లి, ఇప్పుడు హిందీ చిత్రసీమలోనూ పెద్ద అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో చేస్తున్న ఒక చిత్రానికి సుమారు రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు అందుకున్న పారితోషికాల్లో హయ్యెస్ట్‌గా భావిస్తున్నారు. ఈ వార్తలు నిజమైతే, బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా ఉన్న టాప్ హీరోయిన్ల సరసన తక్కువ కాలంలోనే రష్మిక చేరినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాలీవుడ్‌లో రష్మికకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి వరుస విజయాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ‘ఛావా’, ‘యానిమల్’, ‘పుష్ప’ వంటి చిత్రాల విజయాలతో హిందీ ప్రేక్షకుల్లోనూ ఆమెకు మంచి అభిమాన వర్గం ఏర్పడింది. ‘ఛావా’తో నటిగా బలమైన గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు, ఆ తర్వాత వచ్చిన ‘యానిమల్’, ‘పుష్ప 2’ చిత్రాలు కెరీర్‌కు బలమైన స్థంభాలుగా నిలిచాయి.

తరువాత చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, రష్మిక మార్కెట్‌, క్రేజ్ మాత్రం తగ్గలేదు. పైగా కాలక్రమేణా మరింత పెరుగుతూనే ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ, గ్లామర్ పాత్రలకూ సమానంగా ప్రాధాన్యం ఇస్తున్న రష్మికకు బాలీవుడ్‌లో వరుసగా కొత్త అవకాశాలు తలుపుతడుతున్నాయి.

ఇక రష్మిక హయ్యెస్ట్ రెమ్యునరేషన్‌గా వార్తల్లో నిలుస్తున్న చిత్రం విషయానికి వస్తే, బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన ‘కాక్‌టైల్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్‌టైల్ 2’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికతో పాటు షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి హీరో షాహిద్ కపూర్ సుమారు రూ. 35 కోట్లు, హీరోయిన్ కృతి సనన్ రూ. 15 కోట్లు, రష్మిక మందన్నా కూడా రూ. 15 కోట్లు రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నట్లు టాక్. కృతి సనన్ బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా నటిగా స్థిరపడిన స్టార్. ఆమె అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కొద్దికాలమే అవుతోంది.