రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆగస్టు 21న వరల్డ్‌వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. మొత్తం 2 గంటల 25 నిమిషాల నిడివితో సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం, సెన్సార్ సభ్యుల నుంచి ‘ఇరుముడి’కి మంచి స్పందన లభించినట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రి–కూతుళ్ల మధ్య నడిచే భావోద్వేగ బంధం ఈ చిత్రానికి ప్రధాన బలం కానుందని, దానికి తోడు క్రైమ్ సస్పెన్స్ డ్రామా అంశాలు కూడా సమతూకంగా నడుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కథానాయకుడు అయ్యప్ప మాల ధరించిన తర్వాత అతని ప్రవర్తనలో, స్వభావంలో వచ్చే మార్పులు కథలో కీలక మలుపులుగా నిలుస్తాయని సమాచారం. ఈ మార్పుల చుట్టూనే సినిమా ప్రధాన కథనం తిరుగుతుందని, అదే చిత్రానికి హైలైట్‌గా మారే అవకాశముందని టాక్ ఉంది.
దర్శకుడు శివ నిర్వాణ టేకింగ్, కథనాన్ని నడిపిన తీరు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలాన్నిచ్చే అంశాలుగా చెప్పబడుతున్నాయి.
ప్రత్యేకంగా ‘అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్లు సమాచారం. ఈ రెండు పాటలతో పాటు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన రీ–రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, ‘మల్లెపూల పల్లకి’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.
‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ క్యామియో ఉందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
రామ్ చరణ్ క్యామియోపై వస్తున్న వార్తలకు శివ నిర్వాణ ఇచ్చిన ఈ క్లారిటీతో, ఆ ప్రచారానికి బ్రేక్ పడినట్టైంది. రవితేజ మాస్ ఇమేజ్, భావోద్వేగ కథనం, క్రైమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







