‘కాంతారా’ సినిమాతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రిషబ్‌ శెట్టి తాజాగా అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) 2026’లో ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు.

ఆగస్టు 13న మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ వేడుకలో రిషబ్‌ శెట్టి ప్రత్యక్షంగా పాల్గొని ఈ అవార్డును స్వీకరించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలను ప్రపంచ ప్రేక్షకులకు చేరవేసినందుకు గుర్తింపుగా ఐఎఫ్‌ఎఫ్‌ఎం ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది.

భారతీయ కథలలోని మూలాలు, ఆచారాలు, విశ్వాసాలను తన చిత్రాల ద్వారా ఆవిష్కరించడంలో రిషబ్‌ శెట్టి ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. ‘కాంతారా’లో స్థానిక జానపద విశ్వాసాలు, సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన కథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆయనకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన ప్రశంసలు లభించాయి.

ఈ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలను చూపించడానికి స్ఫూర్తినిచ్చే కథలనే నేనెప్పుడూ ఎంచుకుంటాను. మన మూలాలకు సంబంధించిన కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. మెల్‌బోర్న్‌లోని చిత్రనిర్మాతలు, ప్రేక్షకులతో కలిసి భారతీయ సినిమా వైవిధ్యాన్ని వేడుకగా చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాన

రిషబ్‌ శెట్టి ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ జీవితాధారంగా రూపొందనున్న ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌’ చిత్రంలో ఆయన నటించబోతున్నారు. భారతీయ చరిత్రలో కీలక స్థానమున్న ఈ మహానేత జీవితం ఆధారంగా రూపొందే ఈ చిత్రం కోసం ఆయన సిద్ధమవుతున్నారు.

ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు ప్రకటించడంతో రిషబ్‌ శెట్టిపై భారతీయ సినీ వర్గాలు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని రూపొందే కథలకు ప్రపంచ వేదికలపై లభిస్తున్న గుర్తింపు, గౌరవం దేశీయ చిత్రసీమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.