రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి వ్యక్తిగత విలువలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా అవకాశాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెంపర్లాడనని, డబ్బు కోసం తన విలువలను రాజీపడనని ఆమె స్పష్టంగా తెలిపిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మలయాళంలో ‘ప్రేమమ్’ చిత్రంతోనే బంపర్ హిట్ సాధించిన సాయి పల్లవి, ఆ సినిమాలో మలర్ పాత్రతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. అనంతరం ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు ఇంటి సభ్యురాలిలా మారిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆమెకు ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. లేడీ పవర్ స్టార్‌గా గుర్తింపు పొందిన తర్వాత కూడా తాను స్టార్ అనిపించుకునే భావన తనలో లేదని సాయి పల్లవి పలుమార్లు వెల్లడించింది.
ఇప్పటికే వరుస విజయాలతో సౌత్ అగ్ర కథానాయికగా బిజీగా ఉన్న సాయి పల్లవి, సినిమాల ఎంపికలో తన వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని చెబుతోంది. ఒక ఇంటర్వ్యూలో ఆమెను యాంకర్ ముద్దు సన్నివేశాల గురించి ప్రశ్నించారు. దర్శకులు ఎప్పుడైనా ముద్దు సన్నివేశాల్లో నటించమని అడిగారా? అలాంటి సన్నివేశాలు చేయకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అని అడిగిన ప్రశ్నలకు సాయి పల్లవి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
“అవును. చాలా మంది దర్శకులు అడిగారు. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. నేను ముద్దు సన్నివేశాలు చేయనని తెలిసినా అలాంటి ఆఫర్లు ఇంకా వస్తుంటాయి”
అని ఆమె పేర్కొన్నారు.
“నాకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ఉండి ఉంటే నటన కోసమైనా ఇంకొకరిని ముద్దు పెట్టుకోవడం నాకు సరైందిగా అనిపించదు. ఒక మనిషికి సంతోషంగా జీవించడానికి మంచి కుటుంబం, ఉండడానికి ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే చాలు. అవన్నీ నాకు ఇప్పటికే ఉన్నాయి. ఇంకో కారు కొనడానికి, లగ్జరీగా ఉండడానికి నేను ఇంకొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఉన్నదానితో నేను సంతోషంగా ఉన్నాను. నా నటన కోసం మాత్రమే నన్ను ఎంపిక చేసుకుంటే చేస్తాను. ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల కోసమైతే ఇంకొకరిని తీసుకోవచ్చు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు”
అని సాయి పల్లవి స్పష్టం చేశారు.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె విలువలను, ఆలోచనలను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. డబ్బు, లగ్జరీల కంటే వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన తీరు ఆదర్శప్రాయమని అభిప్రాయపడుతున్నారు. ‘దటీజ్ సాయి పల్లవి’ అంటూ ఆమె నిర్ణయానికి మద్దతు తెలుపుతూ అనేక పోస్టులు షేర్ చేస్తున్నారు.
సౌత్ సినిమా వర్గాల్లోనూ సాయి పల్లవి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాణిజ్య ఒత్తిడులు, గ్లామర్ డిమాండ్ల మధ్యలో కూడా తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్న సాయి పల్లవి, నటనకు ప్రాధాన్యం ఇచ్చే నటిగా మరింతగా అభిమానులను సంపాదిస్తోంది.







