రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
సమంత ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ – ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్
టాలీవుడ్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ జూన్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ట్రాలాలా పిక్చర్స్ నిర్మించింది. సంతోష్ నారాయణన్ సంగీతం, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రానంతరం సమంత–నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘మా ఇంటి బంగారం’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఇది పూర్తిగా తీసిపారేయదగ్గ చిత్రం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కథ పరంగా చూస్తే స్వర్ణ (సమంత), అనిరుధ్ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈ పెళ్లి అనిరుధ్ కుటుంబానికి నచ్చకపోవడంతో కొంతకాలం వారిద్దరూ కుటుంబం నుంచి దూరంగా ఉంటారు. అనంతరం అనిరుధ్ చెల్లెలి పెళ్లి నిశ్చయమవడంతో స్వర్ణ, అనిరుధ్ మళ్లీ ఇంటికి తిరిగి వస్తారు. సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే ఆ కుటుంబంలో కలిసిపోయేందుకు స్వర్ణ ప్రయత్నిస్తుంది.
ఇదే సమయంలో జైలులో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) స్వర్ణ గురించి ఆరా తీయడం ప్రారంభిస్తాడు. ఆమె కోసమే జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. స్వర్ణకు, కరుణకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, స్వర్ణ గతం ఏంటి, ఝాన్సీ ఎవరు, కరుణ నుంచి తన కుటుంబానికి ప్రమాదం ఉందని తెలుసుకున్న తర్వాత స్వర్ణ ఏం చేస్తుంది, చివరకు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటుంది అన్నదే మిగతా కథగా సాగుతుంది.
మొదటి భాగంలో కొత్త కోడలిగా సమంత కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత జరిగే రోజువారీ కుటుంబ నాటకం, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో కథ సాఫీగా ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి సమంత గతానికి చెందిన వ్యక్తులు కథలోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. సమంత అసలు ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి అనే అంశాలపై ఒక శక్తివంతమైన యాక్షన్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ ట్విస్ట్‌ను మలిచారు.
రెండో భాగంలో స్వర్ణ ఫ్లాష్‌బ్యాక్, గుల్షన్ దేవయ్య పాత్రతో ఆమెకు ఉన్న పరిచయం, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం చుట్టూ కథ నడుస్తుంది. అయితే మొదటి భాగం సరదాగా సాగినప్పటికీ రెండో భాగం కొంత సాగదీసినట్లుగా అనిపిస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. విలన్ ట్రాక్ బలహీనంగా ఉండటం, కొన్ని సన్నివేశాలు అనవసరంగా అనిపించడం వల్ల కథనం ప్రభావం తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కథ, కథనం కొంతవరకు ‘అతడు’ సినిమాను గుర్తు చేస్తున్నాయని కూడా వ్యాఖ్యానాలు ఉన్నాయి.
నటన పరంగా సమంత వన్ ఉమెన్ షో చూపించింది. కొత్త కోడలిగా, యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీముఖి తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. గుల్షన్ దేవయ్య తన పాత్రతో మరోసారి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో సమర్థవంతంగా నటించారు.
సాంకేతికంగా ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ చిత్రానికి బలాన్నిచ్చింది. విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం బాగుందని, బీజీఎం చిత్రానికి ప్లస్‌గా పనిచేసిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎడిటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు సూచనలు వినిపిస్తున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రేటింగ్:- 2.5/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)







