రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా వసూళ్లు బాగానే ఉంటాయని, సినిమాల కంటెంట్ కొంచెం తేడాగా ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని సినీ వర్గాల్లో మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో సందేహంగా ఉన్నవారూ ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ఫలితాలు చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టాక్ అంతగా బాగోలేకపోయినా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కిన ఉదాహరణలు ఉన్నాయి.
ఈ సంక్రాంతి సీజన్ ఇచ్చిన ధైర్యంతోనే వచ్చే ఏడాది, అలాగే ముందున్న సంక్రాంతి సీజన్ల కోసం కూడా నిర్మాతలు ముందుగానే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఇప్పటికే Sankranthi 2027 కోసం పలు సినిమాలు బెర్తులు బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం మరింత పెరుగుతోంది.
ఇప్పటికే సంక్రాంతికి వస్తామని ప్రకటించిన సినిమాలు ఉన్నప్పటికీ, కొత్తగా మరికొన్ని సినిమాలు కూడా అదే సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఉన్న కన్‌ఫ్యూజన్ ఇప్పుడు పూర్తిగా గందరగోళంగా మారిపోయింది.
ఇటీవల శర్వానంద్ కొత్త సినిమా ‘జార్జ్ క్రిష్’ ప్రారంభోత్సవం రోజునే ఈ చిత్రం జనవరి 14న విడుదలవుతుందని యూనిట్ ప్రకటించింది. మరోవైపు చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న సాయి ధరమ్ తేజ్ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ టీమ్ తమ సినిమా రిలీజ్ డేట్‌ను జనవరి 12గా ప్రకటించింది. దీంతో సంక్రాంతి వారంలోనే రెండు సినిమాలు వరుసగా థియేటర్లకు రానున్నాయి.
సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీయడంలో ప్రత్యేక ఆసక్తి చూపే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితమైన రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా పొంగల్ ఫైట్ కోసం సిద్ధమవుతున్నారు. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించే యోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
నాగార్జున తన వందో సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని యోచిస్తున్నారని తెలిసింది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆ డేట్‌ను తన కుమారుడు నటించిన ‘వృషకర్మ’కి వదిలేసి, వందో సినిమాను సంక్రాంతి సీజన్‌కి మార్చే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ మొత్తం నేపథ్యంలో సంక్రాంతి సీజన్ పూర్తిగా కన్‌ఫ్యూజన్‌గా మారిందని చెప్పొచ్చు. చిరంజీవి – బాబి సినిమా పరిస్థితి ఏమైందనే ప్రశ్న కూడా అభిమానుల్లో వినిపిస్తోంది. మేనమామ సినిమా సంక్రాంతికి ఉండొచ్చనే సమాచారం మధ్యే సాయి ధరమ్ తేజ్ తన సినిమా రిలీజ్‌ను అదే సీజన్‌కి పెట్టుకోవడం, ఆ మామ సినిమా ఆ సమయంలో రాకపోవచ్చనే అర్థం చేసుకునేలా చేస్తోంది. దీనిపై స్పష్టత ఆగస్టు 22న రానుందని టాలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.







