భార్యాభర్తల మధ్య జరిగే నిత్యజీవిత చిన్న చిన్న గొడవలను వినోదాత్మకంగా ఆవిష్కరించి ప్రేక్షకులను అలరించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ మూడో సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అభినవ్‌ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇప్పటివరకు రెండు సీజన్లుగా స్ట్రీమింగ్‌ కాగా, ఇప్పుడు ‘సేవ్‌ ది టైగర్స్‌ 3’ పేరుతో మూడో భాగం సిద్ధమైంది.

జియో హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 19 నుంచి ‘సేవ్‌ ది టైగర్స్‌ 3’ స్ట్రీమింగ్‌ కానుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. కొత్త సీజన్‌లో వినోదం మోతాదును మరింత పెంచుతూ, కుటుంబ జీవితంలోని విభిన్న కోణాలను హాస్యాత్మకంగా చూపించేందుకు ప్రయత్నించినట్టు ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది.

సిరీస్‌ కథను ఈసారి దేవతల ప్రపంచంతో ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలను రూపొందించారు. ముఖ్యంగా ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్‌ కనిపించనుండగా, ఆయన నటన, సంభాషణలు ట్రైలర్‌లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. భార్యాభర్తల సంబంధాలపై, పెళ్లి జీవితంలోని ఎత్తుపల్లాలపై ఆయన చెప్పే హాస్యభరిత డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అభినవ్‌ గోమఠం పాత్ర ద్వారా పెళ్లి, పెళ్లాం గురించి వినిపించే ప్రశ్నలు, వ్యాఖ్యలు కూడా ట్రైలర్‌లో చోటుచేసుకున్నాయి. పెళ్లి అనే బంధం, దాని వల్ల వచ్చే బాధ్యతలు, చిన్న చిన్న తగాదాలు – ఇవన్నీ కలగలిపి సరదాగా చూపించే ప్రయత్నం ఈ సీజన్‌లోనూ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది.

ట్రైలర్‌ చివర్లో వెన్నెల కిషోర్‌ చెప్పిన ఒక డైలాగ్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

ఈ సంభాషణ పెళ్లి జీవితంలోని విరుద్ధతలను, మనుషుల స్వభావాన్ని హాస్యరసంలో చూపించడంతో ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే మొదటి రెండు సీజన్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘సేవ్‌ ది టైగర్స్‌’ మూడో సీజన్‌ కూడా అదే స్థాయిలో, మరింత వినోదంతో అలరిస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.