రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: బాలీవుడ్‌కు చెందిన దర్శక నిర్మాత షకీల్ నూరానీని లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై మాల్వానీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలోని ఒక ఫామ్‌హౌస్‌లో దాక్కున్న నూరానీని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
షకీల్ నూరానీ గతంలో ‘బడే దిల్ వాలా’ (1999), ‘జోరు కా గులామ్’ (2000) వంటి సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయనపై మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR ప్రకారం, ఒక నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
బాధిత నటి ఫిర్యాదు వివరాల ప్రకారం, 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఆమెకు షకీల్ నూరానీతో పరిచయం ఏర్పడింది. అనంతరం కొత్త సినిమా స్క్రిప్ట్ చర్చల పేరుతో నూరానీ తన మాల్వానీ నివాసానికి ఆమెను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
ఆ ఫిర్యాదు ప్రకారం, నూరానీ ఆమెకు ఇచ్చిన డ్రింక్‌లో మత్తుమందు కలిపి, స్పృహతప్పేలా చేసి, ఆ తరువాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు FIRలో నమోదు చేశారు.
ఈ వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టేస్తానని బెదిరిస్తూ, పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పకుండా పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలు కూడా ఇచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.
వేధింపుల కారణంగా తీవ్ర శారీరక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి, చికిత్స కోసం ఆర్థిక సాయం అవసరమైన నేపథ్యంలో 2026లో తిరిగి ముంబైకి వచ్చి మాల్వానీ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై మాల్వానీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 64(2)(M), 123, 351(2), 88 కింద షకీల్ నూరానీపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో ఆరా తీసేందుకు నూరానీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోర్టును అభ్యర్థించారు.
ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన బోరివలి హాలిడే కోర్టు, షకీల్ నూరానీకి ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలంలో నిందితుడిని వివిధ కోణాల్లో ప్రశ్నించి, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
మరోవైపు, షకీల్ నూరానీ న్యాయవాది వికాస్ సింగ్ గోర్ ఈ కేసులో నమోదైన ఆరోపణలను ఖండించారు. తన క్లయింట్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని, కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఆయనను నిరపరాధిగా పరిగణించాల్సిందేనని ఆయన వాదిస్తున్నారు.







