రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: తెలుగు సినీ క్యాలెండర్‌లో వినోదాల పండుగలుగా నిలిచే సీజన్లు ఎన్నో ఉన్నా, ప్రథమార్థంలో సంక్రాంతి, వేసవి సీజన్లు ఎంత కీలకమో.. ద్వితీయార్థంలో దసరా కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థులకు సెలవుల సీజన్ కావడంతో ఈ సమయంలో కనీసం మూడు, నాలుగు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగడం సాధారణం. అందుకే దసరాను పరిశ్రమ వర్గాలు ఓ మినీ సంక్రాంతిగా భావిస్తుంటాయి.
ఈసారి అయితే దసరా బరిలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రతారల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ అంచనాలు మరింత పెరిగాయి.
కథానాయకుడు వెంకటేశ్ గత మూడు సంవత్సరాలుగా వరుసగా సంక్రాంతి సీజన్‌లోనే ప్రేక్షకులను పలకరిస్తున్నారు. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది చిరంజీవితో కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాలతో విజయాలు అందుకున్నారు. అదే జోష్‌తో ఇప్పుడు దసరా సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’ (ఏకే 47) ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వినోదం, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకోసం అక్టోబరు మూడో వారంలో ఓ తేదీని ముందస్తుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇక నాగార్జున విషయానికి వస్తే, తన 100వ సినిమాకోసం దర్శకుడు రా కార్తీక్‌తో చేతులు కలిపారు. ‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కూడా ముగింపు దశకు చేరువలోనే ఉంది. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తిచేసి, దసరా బరిలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. విభిన్న శైలిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జున భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ చిత్రంతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముంబయిలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రారంభం నుంచే ఈ సినిమా దసరా సీజన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే దిశగా చిత్రబృందం కూడా పనులను వేగవంతం చేస్తోందని సమాచారం. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది.
ఇక ఇతర అగ్రతారల సినిమాల విషయానికొస్తే, చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తయినా, వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా విడుదల పలుమార్లు వాయిదా పడింది. జులైలో విడుదల చేసే అవకాశాలపై గతంలో వార్తలు వచ్చినా, ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఆగస్టు నాటికి పనులు పూర్తయితే దసరా బరిలోకి వచ్చే అవకాశముందనే చర్చ వినిపిస్తోంది.
నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ కూడా ముగింపు దశలోనే ఉంది. ఆగస్టు నెలాఖరున విడుదల చేయాలని ముందుగా ప్రకటించినప్పటికీ, ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉండటంతో ఆ తేదీకి రాకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో సెప్టెంబరు లేదా దసరా సీజన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
సాయిదుర్గా తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ గతేడాది దసరాకే రావాల్సి ఉన్నా, షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా ముగింపు దశకు చేరువ కావడంతో, ఈసారి దసరా సీజన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశంపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మొత్తానికి ఈ ఏడాది దసరా సీజన్ కోసం ఇప్పటికే పలువురు అగ్రతారల సినిమాలు రేసులో నిలుస్తుండటంతో, బాక్సాఫీస్ బరిలో పోటీ మరింత హోరాహోరీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విడుదల తేదీలపై అధికారిక ప్రకటనలు వెలువడగానే దసరా బరిలో అసలు పోరు ఎలా ఉండబోతుందో స్పష్టత రానుంది.







