రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. మహేష్–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.
వారణాసి చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి ఎంఎం కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వారణాసి ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నాయి.
ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చార్ట్‌బస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ రెండు పాటల విజయం వల్ల పూర్తి ఆల్బమ్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది.
అయితే ఎంఎం కీరవాణి పేర్కొన్న ఆరు పాటల సంఖ్యపై అభిమానుల్లో ప్రస్తుతం సందేహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలను కలుపుకుని మొత్తం ఆరు పాటలే ఉంటాయా? లేక ఈ రెండు పాటలకు అదనంగా మరో ఆరు పాటలు ఉండనున్నాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
రాజమౌళి సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజన్‌కు ఎంఎం కీరవాణి సంగీతం తోడైతే తెరపై ఎలాంటి అద్భుతం సృష్టించగలదో ప్రేక్షకులు ఇప్పటికే అనేక చిత్రాల ద్వారా చూశారు. ఈ నేపథ్యంలో వారణాసిలో ఆ అద్భుతం మరింత ఎక్కువగా ఉండబోతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న స్పందనను చూస్తుంటే వారణాసి మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ విజయాన్ని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేష్–రాజమౌళి కాంబినేషన్‌కు ఎంఎం కీరవాణి సంగీతం తోడవడంతో ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం వారణాసి ఆల్బమ్, కథ, పాత్రలపై నెట్టింట చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి.







