రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
నాలుగు నెలల్లో ‘వారణాసి’ షూటింగ్ పూర్తి : దర్శకుడు రాజమౌళి
మహేశ్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజా చిత్రం ‘వారణాసి’ షూటింగ్ పూర్తి దశకు చేరుకుంటోంది. మరో నాలుగు నెలల్లో చిత్రీకరణ మొత్తం ముగుస్తుందని రాజమౌళి వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో, విశేషమైన సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫ్రాన్స్‌లో జరిగిన 'అన్నెసీ ఇంటర్నేషనల్ అనిమేషన్ ఫెస్టివల్ ’లో పాల్గొన్న రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ చిత్ర ప్రగతిపై వివరాలు వెల్లడించారు. విజువల్ వండర్‌గా నిలిచే యాక్షన్ ఎపిసోడ్‌లను ఇప్పటికే పూర్తిగా చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం మిగిలిన చిన్న చిన్న సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని చెప్పారు.
"వారణాసి లో ముఖ్యమైన భాగాలను పూర్తిచేశాం. యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం చిన్న చిన్న సన్నివేశాలను షూట్ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ”
సినిమాను ఐమాక్ ఫార్మాట్‌లో రూపొందించాలనే నిర్ణయంపై కూడా రాజమౌళి స్పందించారు. ఈ కథను మొదటి నుంచే IMAX లో చేస్తేనే బాగా న్యాయం జరుగుతుందని భావించామని, అయితే ఆ ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా కథలో మార్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది.
‘వారణాసి’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలోనే కాక, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఈ సినిమాను విస్తృతంగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రిథ్వీరాజ్ సుకుమారం ఇటీవల ‘వారణాసి’ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కొన్ని సన్నివేశాల కోసం రాజమౌళి ఏకంగా 90 టేక్స్ తీసుకున్నారని ఆయన వెల్లడించడంతో, దర్శకుడి పర్‌ఫెక్షన్‌పై మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రతి ఫ్రేమ్‌ను నిష్కళంకంగా మలచాలనే రాజమౌళి శైలికి ఇది నిదర్శనంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, స్టార్ హీరో మహేశ్ బాబుతో కలిసి చేస్తున్న తొలి చిత్రమే ‘వారణాసి’. అందువల్ల ఈ ప్రాజెక్టుపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. షూటింగ్ పూర్తి దశకు చేరుకోవడంతో, త్వరలోనే మరిన్ని అప్‌డేట్లు రానున్నాయని చిత్ర వర్గాలు సూచిస్తున్నాయి.







