రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీధరన్ మూడోసారి కలిసి పనిచేస్తున్న చిత్రం ‘బత్తా’పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ‘నడువుల కొంజం పక్కత్త కానోం’, ‘సీతాకాతి’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈసారి ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అట్లీ సమర్పణలో, బాలాజీ తరణీధరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టు 12న టైటిల్‌తో కూడిన మాస్ రెట్రో లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో విజయ్ సేతుపతి ఎర్ర చొక్కా, సన్ గ్లాసెస్, మెడలో భారీ బంగారు గొలుసుతో స్టైలిష్‌గా కనిపించారు. చేతిలో సిగరెట్‌తో ఆయన కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కథ, విజయ్ సేతుపతి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఈ సినిమాను అట్లీ తన A ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ స్టూడియోస్, సినీ 1 స్టూడియోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యాయి. దీంతో ‘బత్తా’పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
‘జై భీమ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి–బాలాజీ తరణీధరన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి తొలి చిత్రం ‘నడువుల కొంజం పక్కత్త కానోం’ బ్లాక్ కామెడీగా రూపొందింది. పెళ్లికి రెండు రోజుల ముందు తలకు గాయం కావడంతో గతాన్ని గుర్తుపట్టలేని వ్యక్తి కథను వినోదాత్మకంగా చూపించిన ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘సీతాకాతి’తో మరోసారి కలిసి పనిచేశారు.
ఇప్పుడు మూడోసారి ‘బత్తా’ కోసం కలవడంతో ఈ చిత్రంపై సహజంగానే ఆసక్తి పెరిగింది. యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరో కొత్త తరహా పాత్రలో కనిపించే అవకాశం ఉందనే అభిప్రాయం పోస్టర్‌ను చూసిన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
‘బత్తా’ను గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్ ఇండియా దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
విజయ్ సేతుపతి కెరీర్ కూడా వరుస ఆసక్తికరమైన ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘Slum Dog’లో నటిస్తున్నారు. రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
అలాగే మాళవిక మోహనం , రాజ్ B. శెట్టి కలిసి నటిస్తున్న ‘పాకెట్ నవల’లో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజాతో మరోసారి జతకట్టారు. ‘ అరసం’తో పాటు, మనిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి తో కలిసి నటించబోయే చిత్రంలోనూ ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి, తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాలాజీ తరణీధరన్‌తో మూడోసారి కలవడం ‘బత్తా’కు అదనపు బజ్ క్రియేట్ చేస్తోంది.







