మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి ఆలస్యంగా విడుదలై భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రానికి కూడా అదే జరగొచ్చని అభిమానులు ఆశిస్తున్నప్పటికీ, జాప్యం మరీ ఎక్కువైందనే భావన వ్యక్తమవుతోంది.

దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, ఇప్పుడు అయినా అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు అనుకున్న గడువులో పూర్తి కాకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జూలై 10న ‘విశ్వంభర’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనను చిత్రబృందం ప్రారంభ దశలో పరిశీలించినట్లు తెలుస్తోంది. జూన్ చివర్లో విడుదల కావాల్సిన కొన్ని భారీ చిత్రాలు వాయిదా పడటంతో, జూలై రెండో వారంలో సింగిల్ రిలీజ్ లేదా సోలో రిలీజ్ దక్కించుకుంటే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించవచ్చని మేకర్స్ భావించినట్టు టాక్ వినిపించింది.

అయితే తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దసరా సీజన్‌లో భారీ చిత్రాలకు మంచి మార్కెట్ ఉండటం, రాబోయే నెలల్లో టాలీవుడ్‌లో వరుసగా పెద్ద సినిమాలు క్యూ కడుతుండటం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణమని చెప్పుకుంటున్నారు.

డిసెంబర్ నుంచి వరుస స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదనంగా 2027 సంక్రాంతి లక్ష్యంగా చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో మరో చిత్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ను దసరాకే విడుదల చేయడం అనుకూలమని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆ టైంకైనా సినిమా థియేటర్లలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష జోడీ కడుతోంది. ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రంగా ‘విశ్వంభర’పై నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ భారీ నమ్మకంతో ఉంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఆయన కెరీర్‌లో రెండో సినిమాగా రూపుదిద్దుకుంటోంది. అధికారిక రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా నిర్మాతల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.