రాయలసీమ న్యూస్, ఫ్యాక్ట్ చెక్ డెస్క్:
చిన్న మెదడు.. పెద్ద మేధస్సు: మనుషుల్లా నేర్చుకునే నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ చేపలు
చేపలకు జ్ఞాపకశక్తి ఉండదని, వాటి మెదడు చాలా చిన్నదని సాధారణంగా భావిస్తుంటారు. అయితే ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ తాజా పరిశోధన ఒకటి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. చిన్న మెదడు ఉన్నప్పటికీ నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ అనే చేపలు మనుషుల మాదిరిగానే ఇతరులను గమనించి నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మెరుగైన ఫలితాల కోసం తమ నిర్ణయాలను మార్చుకునే తెలివితేటలు కూడా వీటిలో ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.
యూరప్‌లో సాధారణంగా కనిపించే నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ చేపలు మనుషుల లాంటి సామాజిక అభ్యాస వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని డర్హామ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. జంతు ప్రపంచంలో ఇలాంటి సామర్థ్యాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే మొదటిసారి కావడం విశేషంగా భావిస్తున్నారు.
మానవ సమాజంలో సాంకేతికత, జీవన విధానం అభివృద్ధి చెందడానికి ఒక ప్రధాన కారణం ఇతరులను గమనించి, అందులో అత్యుత్తమమైన పద్ధతిని ఎంచుకుని, దానిని మరింత మెరుగుపరచడం. ఈ విధానాన్నే శాస్త్రవేత్తలు ‘హిల్-క్లైంబింగ్’ వ్యూహం అని వ్యవహరిస్తారు. ఇదే వ్యూహాన్ని నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ చేపలు కూడా అనుసరిస్తున్నట్లు పరిశోధనలో బయటపడింది. ఇతర చేపల ప్రవర్తనను తమ స్వంత అనుభవంతో పోల్చి చూసి, ఎక్కువ లాభం దక్కే మార్గాన్ని ఎంచుకునే సామర్థ్యం వీటిలో ఉన్నట్లు తేలింది.
ఈ అధ్యయనంలో భాగంగా 270 నైన్-స్పైన్డ్ స్టిక్ల్‌బ్యాక్ చేపలను సేకరించి ప్రయోగశాల అక్వేరియంలలో ఉంచారు. వీటిని వేర్వేరు గుంపులుగా విభజించి రెండు దశల్లో పరీక్షించారు. మొదటి దశలో ట్యాంక్‌కు ఇరువైపులా రెండు ఫీడర్లను అమర్చారు. ఒక వైపు ఎక్కువ పురుగులు, మరో వైపు తక్కువ పురుగులు వచ్చేలా ఏర్పాటు చేశారు. చేపలు స్వయంగా ఏ వైపు ఎక్కువ ఆహారం దొరుకుతుందో గుర్తుంచుకున్నాయి.
రెండో దశలో శాస్త్రవేత్తలు ఫీడర్ల స్థానాలను మార్చేశారు. గతంలో తక్కువ ఆహారం వచ్చిన వైపు ఇప్పుడు ఎక్కువ ఆహారం వచ్చేలా చేశారు. ఈ మార్పును పరీక్షలో ఉన్న చేపలు నేరుగా అనుభవించకుండా, బయట నుంచి ఇతర చేపలు ఆహారం తింటుండగా గమనించేలా పరిస్థితిని సృష్టించారు.
ఫలితంగా దాదాపు 75 శాతం చేపలు తమ పాత అనుభవాన్ని పక్కన పెట్టి, కేవలం ఇతర చేపలను గమనించడం ద్వారా ఏ వైపు ఎక్కువ ఆహారం వస్తుందో సరిగ్గా గుర్తించాయి. ఆ వైపుకే వెళ్లి ఆహారం తీసుకున్నాయి. అంటే మెరుగైన ఫలితాల కోసం ఇతరుల విధానాన్ని అనుకరించే మేధస్సు మనుషులకే పరిమితం కాదని, చేపల్లో కూడా ఉందని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జెరెమీ కెండల్ ప్రకారం, చిన్న చేపలకు చిన్న మెదడు ఉన్నప్పటికీ అద్భుతమైన సంజ్ఞానాత్మక సామర్థ్యాలు ఉన్నాయని ఈ పరిశోధన సూచిస్తోంది. సామాజికంగా విషయాలు నేర్చుకునే విషయంలో మెదడు పరిమాణం కంటే ఆలోచనా విధానం, అభ్యాస వ్యూహం ముఖ్యమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తమ స్వంత అనుభవం కంటే మెరుగైన ఫలితం వస్తుందని తెలిసినప్పుడే ఇతరులను కాపీ చేయడం వంటి ఈ ప్రత్యేకమైన ‘మానవ మేధస్సు’ లక్షణం చేపల్లో కనిపించడం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.





