ఇప్పటి జీవనశైలిలో మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తోంది. చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు. అయితే మలబద్ధకాన్ని లైట్‌గా తీసుకుంటే ఫైల్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యగా కనిపించే ఈ ఇబ్బంది, దీర్ఘకాలంలో శరీరానికి అనేక రకాల వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు.

మలబద్ధకం ఉన్నప్పుడు కడుపు ఉబ్బరం, ఆకలి తగ్గడం, చికాకు, శరీరమంతా బిగుసుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంటి పనులు చేయడంలో, ఆఫీసు పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బందులు వస్తాయి. పదేపదే వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా చేర్చుకోవడం చాలా అవసరం. పీచు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మలవిసర్జన సరిగా జరగకపోవడం లేదా చాలా కష్టంగా జరగడం మలబద్ధకానికి ప్రధాన లక్షణం. సాధారణంగా వారానికి మూడుసార్ల కంటే తక్కువ సార్లు మలవిసర్జన జరిగితే దానిని మలబద్ధకంగా పరిగణిస్తారు. అయితే మలవిసర్జన అలవాట్లు వ్యక్తిని బట్టి మారుతాయి. కొందరికి రోజుకు అనేకసార్లు మలవిసర్జన జరుగుతుండగా, మరికొందరికి వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే జరుగుతుంది. అయినప్పటికీ, మలాన్ని ఎక్కువసేపు అదుపులో పెట్టడం, నిర్లక్ష్యం చేయడం వంటివి దీర్ఘకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

మలం గట్టిగా, పొడిగా రావడం, విరేచన సమయంలో బలంగా ముక్కాల్సి రావడం, నొప్పి కలగడం మలబద్ధకానికి సాధారణ లక్షణాలు. గట్టిగా మలం రావడం వల్ల గుద్ద చర్మం చిట్లి రక్తస్రావం కావచ్చు. దాంతో తీవ్రమైన నొప్పి, కూర్చోలేని, నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మలబద్ధకానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం, తగినంత నీళ్లు తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, రోజువారీ పనుల్లో అకస్మాత్తు మార్పులు వంటి అంశాలు మలబద్ధకానికి దారితీస్తాయి. కొన్ని మందులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఈ ఇబ్బందిని మరింత పెంచవచ్చు.

ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనం తినే ఆహారం జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే మలబద్ధకాన్ని తగ్గించే ఆహారాలు, పెంచే ఆహారాల గురించి తెలుసుకుని, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవడం అవసరం.

కివి, అవిసె గింజలు, చిలగడదుంప, ప్లమ్స్, పాలకూర, కాఫీ, ఓట్స్, పియర్ పండు, చియా సీడ్స్ వంటి ఆహారాలు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల మలం మృదువుగా మారి, మలవిసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడుతుంది. అలాగే బెండకాయ, అరటికంద, చిక్కుళ్లు వంటి పీచు అధికంగా ఉన్న కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిదిగా భావిస్తున్నారు.

ఇక చీజ్, చాక్లెట్, నూనెలో వేయించిన పదార్థాలు, ఆల్కహాల్, వైట్ బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలు మలబద్ధకం సమస్యను మరింత పెంచే అవకాశముంది. వీటిలో పీచు తక్కువగా ఉండటం, కొవ్వు అధికంగా ఉండటం వల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది. అందువల్ల మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ రకమైన ఆహారాలను తగ్గించడం, లేదా వీలైనంతవరకు దూరంగా ఉండడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.