రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ కోసం అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు నెలల పాటు కొనసాగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధానికి కీలకమైన హెచ్‌పీవీ టీకా కార్యక్రమం రాష్ట్రంలో కొనసాగుతోందని, 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలను లక్ష్యంగా చేసుకుని టీకాలు వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,71,071 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేసినట్లు ఆయన వెల్లడించారు.
హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా గుర్తించబడిన నేపథ్యంలో, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలవుతోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఆడ శిశువుల సంరక్షణ, మహిళా భ్రూణ హత్యల నివారణ దిశగా చేపడుతున్న చర్యల గురించి ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వివరించారు. ప్రీ-కన్సప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్
లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఈ నంబర్ 1800233 2447 ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆడ శిశువులపై వివక్ష, గర్భంలోనే లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు చేయించే చర్యలను అరికట్టేందుకు ఆరోగ్యశాఖ, సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పొడిగింపు, లింగ నిర్ధారణ అక్రమాలపై చర్యలు – ఈ రెండు చర్యల ద్వారా మహిళల ఆరోగ్యం, భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలియజేశాయి.







