రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్: వర్షాకాలం మొదలయ్యే సరికి జిడ్డు చర్మం ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఈ సీజన్లో వాతావరణంలో ఉండే తేమ, చెమట, దుమ్ము, ధూళి చర్మంపై పేరుకుని ముఖాన్ని మరింత జిగటగా మారుస్తాయి. దీని వల్ల మొటిమలు, రంధ్రాలు మూసుకుపోవడం వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో చర్మం మరింత జిడ్డుగా మారడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మన చర్మంలో సహజంగా ఉండే సెబమ్ ఉత్పత్తి సమతుల్యత తప్పినప్పుడు ముఖంపై ఎక్కువ నూనె కనిపిస్తుంది. వర్షాకాలంలో ఉండే ఉక్కపోత, హ్యుమిడిటీ కారణంగా సెబమ్ ఉత్పత్తి చేసే సెబేషియస్ గ్రంథులు మరింత చురుకుగా పనిచేస్తాయి. అందుకే ఈ కాలంలో ఫేస్ ఎక్కువగా ఆయిలీగా మారుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఇంట్లోనే దొరికే ముల్తానీ మట్టి, చందనం పొడి, శనగపిండి, అలోవెరా వంటి పదార్థాలతో జిడ్డు చర్మాన్ని నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.
ముల్తానీ మట్టి
ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ముల్తానీ మట్టిని చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముల్తానీ మట్టి చర్మంపై ఉండే అదనపు జిడ్డును పీల్చుకోవడంలో బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న జిడ్డు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది.
చందనం పొడి
జిడ్డు చర్మ సంరక్షణకు చందనం పొడి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మానికి చలువనిచ్చే గుణం కలిగి ఉండటంతో పాటు సహజమైన మెరుపు ఇస్తుంది. చందనం పొడిలో రెండు చెంచాల పచ్చి పాలు వేసి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. దాదాపు 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. దీనివల్ల చర్మం మృదువుగా మారి సహజ కాంతి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
శనగపిండి మాస్క్
శనగపిండికి చర్మంలోని నూనెను సహజంగా పీల్చుకునే గుణం ఉంది. ఇది జిడ్డును నియంత్రించడమే కాకుండా నల్లటి మచ్చలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో మూడు చెంచాల శనగపిండి, ఒక చిటికెడు పసుపు, మూడు చెంచాల పెరుగు వేసి బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా రాసుకుని ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న అదనపు జిడ్డు తగ్గి చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
అలోవెరా జెల్
కలబందను చర్మ సంరక్షణలో ఆల్‌రౌండర్‌గా భావిస్తారు. ఇది చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఉదయం స్నానం చేయడానికి 10 నిమిషాల ముందు అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని లోపల నుంచి పోషించి, రిపేర్ చేయడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో ఈ విధమైన సహజ చిట్కాలను క్రమంగా పాటిస్తే జిడ్డు చర్మ సమస్యను గణనీయంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.







