దగ్గినా, తుమ్మినా, బరువులు ఎత్తినా మూత్రం లీక్‌ అవుతోందా? బాత్రూం చేరుకునేలోపే మూత్రం ఆపుకోలేకపోతున్నారా? ఇలాంటి సమస్యలను చాలామంది మహిళలు మౌనంగా భరిస్తూ ఉంటారు. అయితే దీన్ని సిగ్గుపడాల్సిన విషయంగా భావించాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సమర్థమైన చికిత్సలతో ఈ సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మూత్రవిసర్జన చేయాలనే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, బాత్రూం అందుబాటులో లేకపోయినా కొంతసేపు నియంత్రించగలుగుతాం. కానీ కొందరు మహిళల్లో ఈ నియంత్రణ పట్టు కోల్పోతుంది. ఈ పరిస్థితిని యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ అంటారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేసినప్పుడు కొన్ని చుక్కల మూత్రం లీక్‌ అయ్యే పరిస్థితి స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌. మరికొందరికి మూత్రవిసర్జన అవసరం అనిపించిన వెంటనే, బాత్రూం చేరుకునేలోపే మూత్రం లీక్‌ అవుతుంటుంది. దీనిని అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్‌ అంటారు. కొందరు మహిళల్లో ఈ రెండు రకాల సమస్యలూ కలిసే మిక్స్‌డ్‌ ఇన్‌కాంటినెన్స్‌ రూపంలో కనిపిస్తాయి.

ఈ ఇన్‌కాంటినెన్స్‌ రకాలకి కారణాలు భిన్నంగా ఉంటాయి. మూత్రాశయం, గర్భాశయాలను వాటి స్థానాల్లో నిలబెట్టే కటి కండరాలు బలహీనపడినప్పుడు స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ తలెత్తుతుంది. మూత్రాశయంలోని డెట్రూజర్‌ కండరం అవసరానికి మించి ప్రేరేపితమై, మూత్రాశయం అతిగా చురుగ్గా మారినప్పుడు అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్‌ వస్తుంది.

కటి కండరాల బలహీనతకు పలు కారణాలున్నాయి. కొత్త తల్లుల్లో, మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళల్లో స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ ఎక్కువగా కనిపిస్తుంది. మెనోపాజ్‌ సమయంలో కండరాల పటుత్వానికి తోడ్పడే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. బరువైన బిడ్డను కనడం, ఎక్కువసేపు ప్రసవ నొప్పులు భరించడం, ప్రసవ సమయంలో అధిక శ్రమ పడటం, జననాంగం దగ్గర కోత పెట్టాల్సి రావడం వంటి కారణాల వల్ల కొత్త తల్లుల్లో కూడా కటి కండరాలు బలహీనపడి స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ కనిపించవచ్చు.

మూత్రాశయం అతిగా చురుగ్గా మారినప్పుడు తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. గంట గంటకూ బాత్రూం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రింబవళ్లూ ఇదే సమస్య వేధించవచ్చు. కొందరిలో అత్యవసరంగా వెంటనే మూత్రవిసర్జన చేయాలనే భావన కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలే దీనికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. కొందరికి సహజంగానే ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. నోరు ఎండిపోవడం, చేతులు చల్లబడడం వంటి లక్షణాలతో పాటు స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ కూడా కనిపించవచ్చు. అలాగే నాడీ సంబంధ సమస్యలు, మెదడు నుంచి వచ్చే సంకేతాల్లో అవరోధాలు, మధుమేహం వల్ల నాడులు దెబ్బతినడం వంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ నుంచి బయటపడడం తేలికేనని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం. కొత్త తల్లులు శరీర బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. కిగిల్‌ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా కటి కండరాలు బలపడతాయి. ఇవి కొత్త తల్లులతో పాటు మెనోపాజ్‌ వయసు మహిళలకు కూడా ప్రయోజనం కలిగిస్తాయి. సరైన కండరాలకు సరైన విధంగా వ్యాయామం అందించగలిగితే దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అయ్యే సమస్యలో 70 నుంచి 80 శాతం వరకు నియంత్రణ సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

మెనోపాజ్‌ వయసు మహిళల్లో అత్యవసర మూత్రవిసర్జన సమస్యను కటి వ్యాయామాలతో పాటు మందుల ద్వారా నియంత్రించవచ్చు. ఇవన్నీ ఫలితం ఇవ్వని సందర్భాల్లో స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ చికిత్స కోసం స్లింగ్‌ ప్రొసిజర్‌ చేయాల్సి వస్తుంది. ఇందులో యురెత్రా ద్వారా మెష్‌ ఏర్పాటు చేయడం లేదా శరీర కణజాలంతోనే అటొలాగస్‌ స్లింగ్‌ ప్రొసిజర్‌ ద్వారా సమస్యను సరిచేస్తారు. అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్‌లో మందులతో ప్రయోజనం లేకపోతే మూత్రాశయాన్ని రిలాక్స్‌ చేయడానికి బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు. అరుదుగా మాత్రమే శస్త్రచికిత్స అవసరం పడుతుంది.

మూత్రం మీద పట్టు కోల్పోయిన మహిళలు ఈ సమస్యను మౌనంగా భరించాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని సిగ్గుపడాల్సిన, అవమానకరమైన అంశంగా భావించకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యల వల్ల బయట పనులు, వేడుకలు, ప్రయాణాలు మానుకుని ఇంటికే పరిమితం కావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. యూరాలజిస్ట్‌ను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స తీసుకుంటే సమస్యను గణనీయంగా తగ్గించుకుని, సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

డాక్టర్‌ దీప్తి సురేఖ, కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌, ఎఐఎన్‌యు, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌