ప్రపంచంలో అత్యంత శీతల ఖండం అంటార్కిటికా. అక్కడ అంతటా తెల్లటి మంచు కొండలే కనిపిస్తాయి. కానీ ఆ మంచు పర్వతాల మధ్య నుంచి హఠాత్తుగా రక్తం లాంటి ఎర్రటి నీరు జలపాతంలా ప్రవహిస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ! గత వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలను సైతం తలపట్టుకునేలా చేసిన ఈ బ్లడ్ ఫాల్స్ రహస్యాన్ని పరిశోధకులు ఎట్టకేలకు ఛేదించారు. అసలు ఆ మంచు కొండల నుంచి రక్తం ఎందుకు కారుతోంది? దాని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి?

ఈ రక్త జలపాతం ఎక్కడుంది?

అంటార్కిటికాలోని మెక్‌ముర్డో డ్రై వ్యాలీస్‌లో టేలర్ గ్లేసియర్ ఉంది. ఈ మంచు పర్వతం నుంచి లేక్ బాన్నీలోకి ప్రవహించే ఎర్రటి జలపాతాన్ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. చూసేందుకు ఇది నిజంగానే రక్తం లాగా కనిపిస్తుంది. 1911లో ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ దీనిని మొదటిసారి కనుగొన్నారు. అప్పటి నుంచి ఈ ఎర్రటి నీటి ప్రవాహం వెనుక ఉన్న కారణాలపై ఎన్నో రకాల ఊహాగానాలు నడిచాయి. వందేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పరిశోధకులు దీని వెనుక ఉన్న అసలైన నిజాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

ఈ జలపాతంలో ప్రవహిస్తున్నది రక్తం కాదు, అలాగే దీనికి ఎలాంటి అగ్నిపర్వత క్రియలతోనూ సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇనుముతో కూడిన ఉప్పు నీరని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇటీవల అంటార్కిటికా సైన్స్ పత్రికలో దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ మంచు కొండ కింద చాలా కాలం క్రితం ఏర్పడిన ఒక పురాతన భూగర్భ ఉప్పునీటి నిల్వ ఉంది. మంచు పర్వతం కదిలేటప్పుడు ఏర్పడే విపరీతమైన ఒత్తిడి వల్ల, ఆ నీరు లోపల ఉన్న రహస్య మార్గాల ద్వారా పైకి తన్నుకుంటూ వస్తుంది.