రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇండోనేషియాలో 6.7 తీవ్రత భూకంపం..
సులవేసీ దీవిలో కుదుపులు
ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. ఫిలిప్పీన్స్లో సంభవించిన భూకంపం ప్రభావం ఇంకా చర్చలోనే ఉండగా, తక్కువ వ్యవధిలోనే ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించటం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక భూకంప పరిశీలనా కేంద్రాల సమాచారం ప్రకారం, సులవేసీ దీవిలోని Palu నగరానికి దక్షిణ–తూర్పు దిశగా సుమారు 42 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమి ఉపరితలానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు ఉత్పత్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.
భూకంపం సంభవించిన వెంటనే సులవేసీ దీవిలోని పలుచోట్ల భారీ కుదుపులు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడినట్లు ప్రాథమిక సమాచారం అందింది. అయితే ఇప్పటివరకు పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు అధికారికంగా నిర్ధారించలేదు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా సేకరణలోనే ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ భూకంపంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదుకాలేదని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భవనాలు, మౌలిక వసతులకు నష్టం జరిగినట్టు సమాచారం వచ్చినప్పటికీ, వాటి వివరాలు ఇంకా సమగ్రంగా లేవని పేర్కొన్నారు.
భూకంపం ప్రభావంతో సమీప సముద్ర ప్రాంతాల్లో అలలు కొంత ఎత్తులోకి ఎగసిపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. సుమాత్రా దీవి పరిసర ప్రాంతాల్లో కూడా సముద్ర అలల తీవ్రత పెరిగినట్టు గమనించినప్పటికీ, పెద్ద స్థాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి లేదని భూకంప నిపుణులు భావిస్తున్నారు.
పసిఫిక్ ప్రాంతంలోని రింగ్ అఫ్ ఫైర్ మండలంలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఉండటంతో ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువగా నమోదయ్యే ఈ మండలంలో భూకంప ముప్పు ఎప్పుడూ ఉండే ప్రమాదంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలే ఫిలిప్పీన్స్లోని సౌత్ ఈస్ట్ సిటీ జనరల్ సాంటోస్ పరిసర ప్రాంతాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ భూకంపం వల్ల అనేక భవనాలు కూలిపోగా, విస్తృత ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. అలాంటి ఘటనల నేపథ్యంలో ఇండోనేషియాలో తాజా భూకంపం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ, స్థానిక పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అవసరమైతే సహాయక చర్యలు ప్రారంభించేందుకు బృందాలు సిద్ధంగా ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.







