హోర్ముజ్ ను మూసివేస్తున్నాం.. ఇరాన్ సంచలన ప్రకటన

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో ఇరాన్ కఠిన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సంతకంతో కూడిన అవగాహనా ఒప్పందం (MoU)లోని మొదటి నిబంధనను అమెరికా అమలు చేయడంలో విఫలమైందని, ఇది శత్రువు చేసిన 'వాగ్దాన భంగం' అని ఇరాన్ పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా ఓడల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'ఫార్స్' వెల్లడించింది.

ఇరాన్ ఆగ్రహానికి కారణాలు:

ఇరాన్ తన సోషల్ మీడియా (X) ఖాతాలో హోర్ముజ్ జలసంధి మూసివేతకు గల కారణాలను స్పష్టం చేసింది. వీటిలో ప్రధానంగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గడానికి నిరాకరించడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ నిరంతరం ఉల్లంఘిస్తూ భీకర దాడులు చేయడం, ఈ దాడుల కారణంగా వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులు కావడం ప్రధాన కారణంగా ఇరాన్ పేర్కొంది.

అంతేకాదు, 'ఇది శత్రువుల నమ్మకద్రోహానికి మా మొదటి స్పందన మాత్రమే. ఒకవేళ ఇజ్రాయెల్ దూకుడు ఇలాగే కొనసాగితే, వారు తమ కట్టుబాట్లను పాటించేలా చేయడానికి మరిన్ని కఠినమైన తదుపరి చర్యలు తీసుకుంటాం' అని కూడా ఇరాన్ హెచ్చరించింది.

ఇజ్రాయెల్ వాదన

మరోవైపు, లెబనాన్‌పై తాము జరిపిన తాజా వైమానిక దాడులను ఇజ్రాయెల్ సమర్థించుకుంది. హిజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని, దానికి ప్రతి చర్య గానే తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఉన్న ఇజ్రాయెల్ సైనికులపై హిజ్‌బొల్లా ఒకే రాత్రిలో 50 కి పైగా రాకెట్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆరోపించింది. దీనికి సమాధానంగా తాము హిజ్‌బొల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, ఆయుధశాలలు, రాకెట్ లాంచ్ ప్యాడ్‌లపై దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల రక్షణ కోసం దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను హిజ్‌బొల్లా తోసిపుచ్చింది. తాము శుక్రవారం మధ్యాహ్నం నుంచే కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, కానీ దక్షిణ లెబనాన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ సైనికులను మాత్రమే తాము అడ్డుకున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దక్షిణ లెబనాన్‌లోని నబాతియే జిల్లాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక లెబనాన్ సైనికుడు సహా మరణించిన వారి సంఖ్య 16కు చేరింది.