రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన క్యాబినెట్‌లో భారతీయ మూలాలున్న ఇద్దరు నాయకులకు మంత్రి పదవులు లభించాయి. వేల్స్ నుంచి ఎంపీగా ఎన్నికైన కనిష్క నారాయణ్ యూకే తొలి కృత్రిమ మేధస్సు (ఏఐ) మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, లీసా నాండీకి మరోసారి సాంస్కృతిక శాఖ మంత్రిత్వం దక్కింది.
లేబర్ పార్టీ నేత ఆండీ బర్న్‌హామ్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రూపొందించిన కొత్త ప్రభుత్వంలో ఏఐకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. ఈ క్రమంలోనే కనిష్క నారాయణ్‌కి పూర్తిస్థాయి ఏఐ మంత్రిత్వ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ భద్రత, కృత్రిమ మేధ విభాగాలను పర్యవేక్షించిన కనిష్క ఇప్పుడు స్వతంత్ర ఏఐ శాఖను నడిపే బాధ్యతను చేపట్టారు.
కీర్ స్టార్మర్ ప్రభుత్వంలోనే కనిష్క నారాయణ్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆన్‌లైన్ భద్రత, కృత్రిమ మేధ సంబంధిత విధానాలు, నియంత్రణ వ్యవస్థలను పర్యవేక్షించడం ఆయన బాధ్యతల్లో భాగం. ఏఐ విధానాల రూపకల్పనలో మరింత కీలకపాత్ర ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో, ఈ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వంగా విస్తరించి కనిష్కను బాధ్యతల్లో కొనసాగించారు.
కనిష్క నారాయణ్ భారతదేశంలోని బిహార్‌లో జన్మించారు. ఆయన లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థికశాస్త్రం విభాగాల్లో చదువుకున్నారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వేల్స్ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆయన, 2025లో మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బ్రిటన్ కొత్త ప్రభుత్వంలో మరో భారతీయ మూలాల నేత లీసా నాండీకి కూడా కీలక బాధ్యతలు దక్కాయి. మాంచెస్టర్ నగరంలో జన్మించిన లీసా తండ్రి దీపక్ నాండీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. తల్లి బ్రిటిష్ జాతీయురాలు. 2010 నుంచి లీసా నాండీ విగాన్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన లీసా నాండీకి, ఆండీ బర్న్‌హామ్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మరోసారి అదే శాఖ బాధ్యతలు అప్పగించారు. బ్రిటన్ రాజకీయాల్లో భారతీయ మూలాల నేతల ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో, కనిష్క నారాయణ్‌కి తొలి ఏఐ మంత్రిత్వం, లీసా నాండీకి సాంస్కృతిక శాఖ మంత్రిత్వం లభించడం విశేషంగా భావిస్తున్నారు.







