రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
మాస్కోపై డ్రోన్ల దాడులు తీవ్రం.. నాలుగు విమానాశ్రయాలు మూత
రష్యా పై ఉక్రెయిన్ దాడులు మరింత ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మాస్కో, దాని పరిసర ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఆదివారం భారీ స్థాయిలో డ్రోన్లతో దాడులు జరిపింది. వందల సంఖ్యలో ప్రయోగించిన ఈ డ్రోన్లలో దాదాపు 60ను కూల్చివేసినట్లు రష్యా ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల నేపథ్యంలో మాస్కో నగరంలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. గగనతల భద్రత దృష్ట్యా విమానాల రాకపోకలను నిలిపివేసి, కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించినట్లు అక్కడి వర్గాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్ దాడులు క్రిమియా ప్రాంతంపైనా కొనసాగుతున్నాయి. దీనితో అక్కడ అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలో సోమవారం జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరారు.
ఇంధన సదుపాయాలు, చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్ లక్ష్యంగా దాడులు చేయడంతో క్రిమియాలో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా నగరవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లలో సాధారణ ప్రజలకు, ప్రభుత్వేతర సంస్థలకు ఇంధన విక్రయాలను నిలిపివేసినట్లు సమాచారం.
ఉక్రెయిన్ ప్రతిరోజూ వందల డ్రోన్లతో దాడులు కొనసాగించడంతో మాస్కోలో ఆందోళన వాతావరణం నెలకొంది. గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూనే, కీలక మౌలిక వసతుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు రష్యా వర్గాలు సూచిస్తున్నాయి.
ఇక ప్రతిదాడుల భాగంగా రష్యా, ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతమైన ఒడెసాపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇంధన నిల్వ ట్యాంకుల్లో భారీ మంటలు చెలరేగి పరిసర ప్రాంతాలను ఆందోళనకు గురి చేశాయి.
రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుపక్షాలు పరస్పరం కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల సాధారణ ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఇంధన సరఫరా, రవాణా, విద్యుత్ రంగాల్లో అంతరాయాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.







