ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భారీ భూకంపం…

సునామీ హెచ్చరికలు, తీర ప్రాంతాల ఖాళీ

ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంతాల్లో అప్రమత్తత పెరిగింది.

స్థానిక కాలమానం ప్రకారం 2026 జూన్ 8 ఉదయం వచ్చిన ఈ భూకంపం ప్రభావం ఫిలిప్పీన్స్‌తో పాటు పొరుగు దేశాలైన వియత్నాం, కంబోడియా తదితర దేశాల్లో కూడా అనుభవించబడింది. ప్రకంపనలు విస్తృతంగా నమోదవడంతో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ GFZ ప్రకారం, భూకంప కేంద్రం మిందనావోకు సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మొదట ఈ సంస్థ భూకంప తీవ్రతను 7.3 నుంచి 8.2 మధ్యగా అంచనా వేసి, అనంతరం తాజా డేటా ఆధారంగా 7.8గా సవరించింది.

ఫిలిప్పీన్స్ మీడియా సమాచారం ప్రకారం, 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ కుదుపులు నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. భూకంపం తర్వాత సముద్ర తీర ప్రాంతాల్లో అలలు అసాధారణంగా ఎగసిపడినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. అయితే కొంతసేపటికి సముద్రం మళ్లీ కొంత శాంతించినట్లు తెలిపారు. ఇప్పటివరకు పెద్ద స్థాయిలో నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

భూకంపం సమయంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని పాత భవనాలు కూలినట్లు, అనేక బిల్డింగుల గోడలు, పెచ్చులు ఊడినట్లు స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు వాహనాలను పక్కకు ఆపి బయటకు పరుగులు తీశారు. భూకంపం సంభవించిన సమయంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులను వెంటనే గ్రౌండ్లకు తరలించి కూర్చోబెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని స్థానిక అధికారులు తెలిపారు.

భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్, ఇండోనేషియాల్లో భూకంపాలు తరచుగా సంభవించడం తెలిసిందే. అమెరికా భూకంప కేంద్రం ప్రకారం, ఈ భూకంపంతో తక్షణం భారీ నష్టం నమోదు కాకపోయినా, తరువాతి గంటల్లో పరిస్థితిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని సూచించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సునామీ ప్రమాదం పూర్తిగా తగ్గే వరకు తీర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.