దక్షిణ టెక్సాస్‌లోని హైవేపై చిన్న విమానం కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

NetJets‌కు చెందిన Cessna Citation Latitude విమానం San Jose Del Cabo నుంచి Laredo విమానాశ్రయానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో విమానం హైవేపై కూలిపోయినట్లు Laredo పోలీసులు వివరించారు.

విమానం రోడ్డుపై పడిపోవడంతో అక్కడుగా వెళ్తున్న పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రక్షణ బృందాలు విమానం కాక్‌పిట్‌ అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. చిన్న విమానం కావడంతో పదుల సంఖ్యలోనే ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించలేదు. మృతుడి వివరాలను కూడా అధికారికంగా ప్రకటించలేదు.

ప్రమాదం కారణంగా ఆ హైవేపై రాకపోకలను కొన్ని గంటల పాటు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ప్రమాదానికి గురైన విమానం అవశేషాలను తొలగించి, రహదారిని శుభ్రం చేసిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విమానం సాంకేతిక లోపం, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.