ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని మరింత బలపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా.. సౌదీ అరేబియాతో కీలక అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అరబ్‌ దేశంతో 30 ఏళ్లపాటు పౌర అణు విద్యుత్‌ రంగంలో భాగస్వామ్యానికి ఈ ఒప్పందం దారితీసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సౌదీ భూభాగంలో యురేనియం శుద్ధికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుమతి ఇవ్వడం ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అమెరికా-సౌదీ న్యూక్లియర్ డీల్ ప్రకారం పౌర అణు విద్యుత్‌ ఉత్పత్తి, స్వచ్ఛ ఇంధన వినియోగం, ఆర్థిక సహకారం ప్రధాన లక్ష్యాలుగా నిర్ధారించారు. ఈ ఒప్పందం కింద సౌదీ పౌర అణు విద్యుత్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించవచ్చు. అణు విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం, అణు ఇంధన సరఫరా, రియాక్టర్‌ సాంకేతికత బదిలీ, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు శిక్షణ, రేడియోధార్మిక పదార్థాల నిర్వహణ, అంతర్జాతీయ తనిఖీలు, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాల్లో అమెరికా ఫ్రేమ్‌వర్క్‌ అందించనుంది. శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి అణు విద్యుత్‌ ద్వారా ఇంధన భద్రతను సాధించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.

ఈ డీల్‌ అమెరికా అటామిక్ ఎనర్జీ ఆక్ట్ లోని సెక్షన్‌ 123 కింద కుదిరింది. ఈ సెక్షన్‌ ఆధారంగా అమెరికా తన అణు సాంకేతికత, ముడి పదార్థాలను భాగస్వామ్య దేశాలకు ఎగుమతి చేయగలదు. ఇలాంటి పౌర అణు ఒప్పందాలు అమెరికా ఇప్పటివరకు దాదాపు 20 దేశాలతో కుదుర్చుకుంది. వీటిలో ఇండియా , UAE, జపాన్ , సౌత్ కొరియా , కెనడా , ఆస్ట్రేలియా తో పాటు పలు యూరప్‌ దేశాలు ఉన్నాయి.

అయితే, సౌదీ ఒప్పందంలో కీలక మలుపు యురేనియం శుద్ధి అంశం. అమెరికా కుదుర్చుకున్న చాలా పౌర అణు ఒప్పందాల్లో యురేనియం శుద్ధి, ఇంధన పునఃప్రక్రియపై కఠిన ఆంక్షలు ఉంటాయి. కానీ సౌదీ ఈ తరహా ఆంక్షలను అంగీకరించలేదని సమాచారం. ఫలితంగా యురేనియం శుద్ధికి అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. సాంకేతిక అధ్యయనాల ఆధారంగా, అమెరికా మద్దతుతో సౌదీ తన భూభాగంలో యురేనియం శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకునే మార్గం ఈ డీల్‌ ద్వారా సుగమమైంది. అయితే ఈ శుద్ధి ప్రక్రియపై అమెరికా కాలక్రమేణా సమీక్షలు నిర్వహించే నిబంధనను ఒప్పందంలో చేర్చారు.

యురేనియం శుద్ధికి అనుమతి లభించిందని మాత్రమే చూసి సౌదీకి అణు బాంబు తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా భావించరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సహజ యురేనియంలో విచ్ఛిన్నం చెందగల ఐసోటోప్‌ యురేనియం-235 శాతం 0.7 మాత్రమే ఉంటుంది. పౌర అణు రియాక్టర్ల కోసం యురేనియాన్ని 3–5 శాతం వరకు శుద్ధి చేస్తారు. పరిశోధనల కోసం 20 శాతం శుద్ధి అవసరం. అణు బాంబు తయారీకి మాత్రం 90 శాతం శుద్ధి చేసిన వెపన్‌-గ్రేడ్‌ యురేనియం కావాలి.

అణు విద్యుత్‌ ఉత్పత్తిలో ఉపయోగించే సెంట్రిఫ్యూజ్‌లనే అణ్వాయుధ తయారీలోనూ వినియోగించవచ్చు. అయితే ఎన్ని సెంట్రిఫ్యూజ్‌లు, ఎంతకాలం ఆపరేట్‌ చేస్తున్నారన్నదే యురేనియం శుద్ధి స్థాయిని నిర్ణయిస్తుంది. ఒకవేళ సౌదీ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేయాలనుకుంటే.. యురేనియం శుద్ధి ఒక్కటే సరిపోదు. అంతర్జాతీయ అణు భద్రతా ఒప్పందాల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అదనంగా అణ్వాయుధ డిజైన్‌, డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ఇవన్నీ రహస్యంగా కొనసాగించడం కష్టం. ఈ నేపథ్యంలో సౌదీ తక్షణంలో అణ్వాయుధ తయారీపై దృష్టి పెట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని నిపుణుల అభిప్రాయం.