హోర్ముజ్‌ సమీపంలో యూఎస్‌ అపాచీ హెలికాప్టర్‌ కూలింపు

అమెరికా ఆర్మీకి చెందిన ఒక అపాచీ హెలికాప్టర్‌ హోర్ముజ్‌ జలసంధికి సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఈ ఘటన ఇజ్రాయెల్‌, ఇరాన్‌లు పరస్పర దాడులకు దిగిన రోజే జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో హెలికాప్టర్‌ కూలిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ దాడి కారణంగా హెలికాప్టర్‌ కూలిపోయిందా, లేక సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అన్న దానిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

హెలికాప్టర్‌ కూలిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధృవీకరించారు. హెలికాప్టర్‌లో ఉన్న పైలట్లు క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఆయన వివరాలు వెల్లడించలేదు. హోర్ముజ్‌ జలసంధి పరిసరాల్లో ఇరాన్‌ దూకుడును కట్టడి చేసేందుకు అమెరికా అపాచీ హెలికాప్టర్‌లతో పాటు రీపర్‌ డ్రోన్లు, ఎఫ్/ఏ-18, ఎఫ్-35 ఫైటర్‌ జెట్లను వినియోగిస్తోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యూఎస్‌ మిలిటరీ విహంగాలపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు ఇరాన్‌ దాడుల్లో 42 మిలిటరీ విహంగాలను అమెరికా కోల్పోయిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

అయితే అపాచీ హెలికాప్టర్‌ను కోల్పోవడం మాత్రం ఇదే మొదటిసారి అని ఆ కథనాలు సూచిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యాధునిక మిలిటరీ హెలికాప్టర్‌లలో అపాచీ ఒకటిగా పరిగణించబడుతుంది. హెల్‌ఫైర్‌ మిసైళ్లతో ఇది శత్రు దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదు. యుద్ధ ట్యాంకులను కూడా ఈ మిసైళ్లు ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. శత్రుదేశ తూటాలను తట్టుకునేలా గట్టి కవచంతో అపాచీ హెలికాప్టర్‌ను రూపొందించారు. హోర్ముజ్‌ ప్రాంతంలో డ్రోన్లు, చిన్న బోట్లు, ఇతర లక్ష్యాలను టార్గెట్‌ చేసేందుకు యూఎస్‌ ఆర్మీ అపాచీ హెలికాప్టర్‌లను వినియోగిస్తోంది. తాజా ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో అమెరికా మిలిటరీ కార్యకలాపాలు, భద్రతా ఏర్పాట్లపై మరింత దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.