రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: భారత్‌కు విక్రయించిన కీలక రక్షణ సామగ్రికి సంబంధించి దీర్ఘకాలిక సర్వీసులు, నిర్వహణ, సాంకేతిక సహాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు 482 మిలియన్ డాలర్ల విలువైన సహాయక ప్యాకేజీకి అమెరికా విదేశాంగశాఖ ఆమోదం తెలిపి, అక్కడి కాంగ్రెస్‌కు సమాచారం అందించింది.
భారత్ వద్ద ఉన్న అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అల్ట్రాలైట్ శతఘ్నులకు సంబంధించిన సర్వీసులు, విడిభాగాల సరఫరా, శిక్షణ, లాజిస్టిక్స్ మద్దతు వంటి అంశాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. విదేశాలకు ఆయుధాల విక్రయాలు, సంబంధిత సేవలను పర్యవేక్షించే అమెరికా సంస్థ ది డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది.
ఈ నిర్ణయంతో భారత్ రక్షణ దళాల అమ్ములపొదిలో ఇప్పటికే ఉన్న కీలక ఆయుధ వ్యవస్థల నిర్వహణ మరింత సుగమం కానుంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతతో కూడిన అపాచీ హెలికాప్టర్లు, ఎం777 శతఘ్నుల పనితీరును నిరంతరం సజావుగా కొనసాగించేందుకు అవసరమైన సాంకేతిక సహాయం, విడిభాగాల లభ్యత, అప్గ్రేడ్లు వంటి అంశాల్లో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
అమెరికాలోని బోయింగ్ , లొక్హీద్ మార్టిన్ కంపెనీలు అపాచీ హెలికాప్టర్ల సర్వీసు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తుండగా, భే స్య్స్తెంస్ ఎం777 శతఘ్నులకు సర్వీసు కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. ఈ సంస్థల ద్వారా భారత్‌కు అవసరమైన సాంకేతిక మద్దతు, శిక్షణ, మరమ్మతు సేవలు అందించబడతాయి.
అమెరికా విదేశాంగశాఖ కాంగ్రెస్‌కు పంపిన సమాచారంలో ఈ సహాయక ప్యాకేజీ భారత్ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని, ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత్–అమెరికా రక్షణ సహకారంలో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో భారత్–అమెరికా మధ్య రక్షణ రంగంలో ఒప్పందాలు, సంయుక్త విన్యాసాలు, సాంకేతిక భాగస్వామ్యం గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజా సర్వీసు ప్యాకేజీ భారత్ రక్షణ వ్యవస్థల దీర్ఘకాలిక నిర్వహణకు భరోసానిచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







