అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు

న్యూయార్క్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడేలా శాంతి ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ ఒప్పందంపై డిజిటల్ రూపంలో సంతకాలు చేశారు. మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఈ ఒప్పందంతో ముగింపు లభించగా, త్వరలో హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

జీ7 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్‌లో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బుధవారం వర్సైల్లెస్ ప్యాలెస్‌లోపల నుంచే శాంతి ఒప్పందంపై డిజిటల్ సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు.

సంతకం చేయటం అయిపోయింది. ఇప్పుడే వర్సైల్లెస్‌లో ఒప్పందంపై సంతకం చేశాను.

ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘేయ్, ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ IRNAతో మాట్లాడుతూ, రెండు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇప్పుడు ఈ ఒప్పందం అమలును పరీక్షించే దశకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

రెండు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఈ ఒప్పందం అమలును పరీక్షించాల్సిన సమయం వచ్చింది.

అయితే శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒప్పంద నిబంధనలకు ఇరాన్ కట్టుబడి ఉండకపోతే మళ్లీ ఆ దేశంపై దాడులు చేయడాన్ని వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

అవగాహన ఒప్పందం ఎంవోయూ ఫైనల్ కాదు. అది నాకు నచ్చకపోయినా, వాళ్లు ఇరాన్ దానికి కట్టుబడి ఉండకపోయినా మేము మళ్లీ ఇరాన్‌పై బాంబులు వేస్తాం. ఎందుకంటే ఇరాన్ గత 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది.

నిన్నటి నుంచే శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు రెండు దేశాల వర్గాలు సూచిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణాను దశలవారీగా పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఊరట కలిగించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.