రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా లోని పెన్షకాల బీచ్ లో US నేవీ కి చెందిన యుద్ధ విమానాలు అత్యల్ప ఎత్తులో దూసుకెళ్లిన ఘటన స్థానికులు, పర్యాటకుల్లో భయాందోళనలకు దారి తీసింది. సముద్ర తీరంలో అలలను ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న సందర్శకుల తలపై నుంచి ఒక్కసారిగా ఫైటర్ జెట్లు భారీ శబ్దంతో దూసుకెళ్లడంతో బీచ్ ప్రాంతం మొత్తం గందరగోళంగా మారింది.
అమెరికా నౌకాదళానికి చెందిన బ్లూ ఏంజెల్స్ ఫైటర్ జెట్లు ఈ లో ఫ్లైబై నిర్వహించిన సమయంలో వాటి వేగం, శబ్దానికి బీచ్‌లో ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు గాల్లోకి ఎగిరిపోయాయి. ఇసుక దుమారం లేచి, అక్కడున్నవారు భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
ఈ సంఘటనపై US నేవీ ఫ్లైట్ డెమోన్స్ట్రేషన్ స్క్వాడ్రన్ విచారణ ప్రారంభించింది. బ్లూ ఏంజెల్స్ స్క్వాడ్రన్ నుంచి విడుదలైన ప్రకటనలో, ఆ రోజున నిర్వహించిన ఫ్లైబై సమయంలో యుద్ధ విమానాలు అమలులో ఉన్న ప్రమాణాల్ని ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. నిర్దేశించిన కనిష్ఠ ఎత్తు కంటే చాలా తక్కువ ఎత్తులో విమానాలు ప్రయాణించినట్టు స్క్వాడ్రన్ గుర్తించింది.
US నేవీ ఫ్లైట్ డెమోన్స్ట్రేషన్ స్క్వాడ్రన్ తమ నగర ప్రజలు, బీచ్ సందర్శకులు, పైలట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో, పెన్షకాల బీచ్ ఘటనపై పూర్తి స్థాయి అంతర్గత దర్యాప్తు జరిపి, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని నేవీ అధికారులు స్పష్టం చేసినట్లు స్థానిక మీడియా నివేదించింది.
సాధారణంగా బ్లూ ఏంజెల్ ఫ్లైట్ డెమానిస్ట్రేషన్ స్క్వాడ్రన్ US నేవీ , US మెరైన్ కార్ప్స్ కు చెందిన పైలట్లతో కూడి, అమెరికా వ్యాప్తంగా నిర్వహించే ఎయిర్ షోలలో ప్రదర్శనలు ఇస్తుంది. అయితే పెన్షకాల బీచ్ ఘటనలో బీచ్ ప్రాంతానికి అత్యంత సమీపంగా, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర అసౌకర్యం, భయాన్ని ఎదుర్కొన్నారని ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులతో పాటు ఫెడరల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థలు కూడా సమాచారం సేకరిస్తున్నాయి. దర్యాప్తు నివేదిక వెలువడిన తర్వాత అవసరమైన మార్పులు, అదనపు భద్రతా మార్గదర్శకాలు అమలు చేసే అవకాశమున్నట్లు అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.







