బీబీసీలో భారీ ఉద్యోగాల కోత..

2,000 మందికి ఉద్వాసన?

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న బ్రిటన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ‘బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ)లో ఉద్యోగులకు భారీ దెబ్బ తగలనున్నట్లు సమాచారం. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సంస్థ ఖర్చులను గణనీయంగా తగ్గించే ప్రణాళికలో భాగంగా వచ్చే వారం నుంచే వందలాది ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తు నిధుల కేటాయింపులపై బీబీసీ లోపల జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరిన సమయంలోనే ఈ కీలక నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది.

బీబీసీ అంతర్గత బృందాలకు దాదాపు 10 శాతం మేర ఖర్చులను తగ్గించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో మొత్తం మీద సుమారు 2,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ లేఆఫ్స్ ప్రభావం మొదటగా బీబీసీ ప్రధాన వార్తా విభాగంపైనే తీవ్రంగా పడనుందని నివేదికలు సూచిస్తున్నాయి.

మొత్తం 20,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్న బీబీసీలో, కేవలం వార్తా విభాగంలోనే దాదాపు పావువంతు మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ విభాగంలో బడ్జెట్‌లో ఎక్కువ భాగం జీతాలకే వెళ్తుండటంతో, ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా తొలిదశలోనే న్యూస్ టీమ్‌ నుంచి వందలాది మందిని తొలగించే అవకాశముందని సమాచారం. వచ్చే వారం ప్రకటించబోయే తొలి విడత ఉద్యోగాల కోతలో వార్తా విభాగం ప్రధానంగా ప్రభావితమవుతుందని చెబుతున్నారు.

కంటెంట్‌కు సంబంధించిన ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించకుండా కూడా ఖర్చులను నియంత్రించే మార్గాలు ఉన్నప్పటికీ, న్యూస్ టీమ్‌లో మాత్రం ఉద్యోగాల కోత తప్పదనే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల ప్రభావంతో కొన్ని రేడియో కార్యక్రమాలు, ఇతర సేవల్లో ప్రేక్షకులు, శ్రోతలు మార్పులను గమనించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే సంస్థవ్యాప్తంగా కొత్త నియామకాలపై ఆంక్షలు విధించిన బీబీసీ, అధికారిక ప్రయాణాలను కూడా గణనీయంగా కత్తిరించింది. కాన్ఫరెన్స్‌లు, అవార్డు కార్యక్రమాల వంటి ఖర్చులను తగ్గించే చర్యలు కూడా అమల్లో ఉన్నాయి. ప్రస్తుత నిర్వహణ వ్యయాలను తగ్గించుకుంటూనే, భవిష్యత్తు ప్రాజెక్టులైన ‘ఐప్లేయర్’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, యూట్యూబ్‌ వంటి వేదికలపై డిజిటల్ ఉనికిని బలోపేతం చేయడానికే ఈ పొదుపు చర్యలు చేపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం బ్రిటన్‌లో లైవ్ టీవీ లేదా బీబీసీ ఐప్లేయర్ చూడాలంటే లైసెన్స్ ఫీజు చెల్లించడం తప్పనిసరి. అయితే Netflix వంటి ప్రైవేట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ఈ నిబంధన వర్తించదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లైసెన్స్ ఫీజు నమూనాను పునర్విమర్శించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా, మీడియా రంగంలో ఉద్యోగాల కోత ధోరణి బీబీసీతో మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల అమెరికాకు చెందిన వార్తా సంస్థ ‘The Associated Press’ (AP) విజువల్ రిపోర్టింగ్‌పై దృష్టి పెంచే క్రమంలో 20 మంది జర్నలిస్టులను తొలగించింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ పత్రిక ‘The Washington Post’ కూడా తన సిబ్బందిలో దాదాపు మూడో వంతు మేర తగ్గించుకోవడం గమనార్హం. గ్లోబల్ మీడియా రంగంలో కొనసాగుతున్న ఈ లేఆఫ్స్ ధోరణి ఉద్యోగ భద్రతపై మరింత అనిశ్చితిని సృష్టిస్తోంది.