జాతీయ రహదారి పనుల్లో నాసిరకం

సర్వీసు రోడ్లపై పగుళ్లు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల పూర్తి చేసిన 340సీ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. నన్నూరు టోల్‌ ప్లాజా సమీపం నుంచి ఆత్మకూరు వరకు 66.115 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా రహదారి నిర్మాణానికి రూ.1178 కోట్లు ఖర్చు చేశారు. రెండు విడతలుగా పనులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒప్పందం ప్రకారం గుత్తేదారులు పదేళ్లపాటు రహదారి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి. అయితే రుద్రవరం, గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, కృష్ణరావుపేట, ఎర్రగూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో నిర్మించిన పైవంతెనల వద్ద భూమి కుంగిపోవడం, సర్వీసు రోడ్లు నెర్రలు ఇవ్వడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన కాల్వలు కొన్ని చోట్ల విడిపోయాయి.

పైవంతెనల వద్ద మట్టి కొట్టుకుపోకుండా వేసిన కాంక్రీట్‌ పనులకు సరైన క్యూరింగ్‌ చేయకపోవడంతో అవి నెర్రలు ఇచ్చి ఊడిపోతున్నాయి. నాలుగు వరుసల 340సీ జాతీయ రహదారిపై పడిన వర్షం నీరు కిందికి వెళ్లేందుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన రైన్‌ గల్లీలు కూడా ఎక్కువగా పగుళ్లు ఇచ్చి దెబ్బతిన్నాయి. దీంతో వర్షం నీరు సరిగా పారక, రహదారి అంచులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది.

నందికొట్కూరు పట్టణ శివారులోని రబ్బానీ గోదాము సమీపంలో పైవంతెన వద్ద నిర్మించిన సర్వీసు రోడ్డు నాసిరకంగా ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోనే సర్వీసు రోడ్డు పగుళ్లు ఇవ్వడంతో దానికి తారు పూత వేశారు. అయితే కొద్ది కాలానికే మళ్లీ అదే ప్రాంతంలో పగుళ్లు వచ్చాయి. సర్వీసు రోడ్డు ఆనుకొని నిర్మించిన మట్టి కట్ట, కాల్వల వద్ద గ్యాపులు ఏర్పడి పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రోడ్డుపై పడిన వర్షం నీరు బయటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రైన్‌ గల్లీల్లో కోతలు పడి, రంధ్రాలు ఏర్పడ్డాయి. పైవంతెనకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు పగుళ్లు ఇచ్చి నెర్రలు బయటపడుతున్నాయి. నెర్రలు వచ్చిన చోట గుత్తేదారుడు పాత పొరను పూర్తిగా తొలగించి కొత్త రహదారి నిర్మించకుండా, తారు పూతతోనే కప్పిపుచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా అదే ప్రాంతంలో మళ్లీ నెర్రలు కనిపిస్తున్నాయి.

నాలుగు వరుసల ప్రధాన దారి నుంచి అండర్‌ పాసింగ్‌ వరకు ఉన్న సర్వీసు బీటీ రోడ్డుకు వేసిన మట్టి కూడా పగుళ్లు ఇచ్చింది. భారీ వర్షం కురిసే సమయంలో ఈ మట్టి మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే రోడ్డు కుంగిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కాల్వలు, బీటీ రహదారి మధ్య భారీ గ్యాపులు రావడంతో కొన్ని చోట్ల రోడ్డు ఇప్పటికే కుంగిపోయింది.

ఇలాంటి నాణ్యతా లోపాలపై సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారుల నుంచి వివరణ కోరాలని, రహదారి మరమ్మతులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.