రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లి గుండెలవిసేలా రోదించడం చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ఒరిస్సా అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం వచ్చాడు. మంత్రాలయం శివారులో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో దర్శనం ముగించుకుని కుటుంబసమేతంగా రహదారి దాటేందుకు ప్రయత్నించాడు.
ఈ సమయంలో కర్ణాటక నుంచి యాత్రికులతో వచ్చిన ఆర్టీసీ బస్సు అక్కడికి చేరుకుంది. రహదారి దాటుతున్న ఒరిస్సా కుటుంబ సభ్యుల దగ్గర్లోకి బస్సు వేగంగా రావడంతో అతని కుమారుడు కార్తిక్ (4)ను ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టడంతో బాలుడు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
కళ్ల ముందే కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు విలపించారు. వారి రోదనలు, ఆర్తనాదాలు అక్కడున్న భక్తులను, స్థానికులను కలచివేశాయి. సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
బాలుడి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కర్ణాటక ఆర్టీసీ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందా, లేక ఇతర కారణాలున్నాయా అన్న దానిపై మంత్రాలయం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
దైవ దర్శనానికి వచ్చి ఇలాంటి విషాదం ఎదురుకావడంతో మంత్రాలయం ప్రాంతంలో విషాదఛాయ నెలకొంది. యాత్రికులు, భక్తులు రహదారులు దాటేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని, బస్సులు, ఇతర వాహనాలు కూడా యాత్రా క్షేత్రాల వద్ద నెమ్మదిగా నడపాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.













