రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చింతల ముని నగర్‌కు సంబంధించిన దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న భూ సమస్యకు తెరపడింది. సర్వే నంబర్ 448/ఏ3లో ఉన్న 8.10 ఎకరాల ప్రభుత్వ భూమి 22-ఏ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల అక్కడ నివసిస్తున్న కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారమవడంతో 500 కుటుంబాలకు ఇంటి పట్టాల జారీకి మార్గం సుగమమైంది.
చింతల ముని నగర్లో 500 కుటుంబాలు తమ పూర్వీకుల కాలం నాటి నుండి వందేళ్లకు పైగా నివసిస్తూ వస్తున్నాయి. 1982లో వీరికి భూములకు సంబంధించిన పట్టాలు ఉన్నప్పటికీ, సంబంధిత భూమి 22-ఏ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల కొనుగోలు, అమ్మకాలు, హక్కుల బదిలీ వంటి లావాదేవీలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమస్య పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలు ప్రయత్నాలు కొనసాగించారు.
ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అధికారులు ఈ భూ సమస్యను పరిశీలించి, నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించే ప్రక్రియను పూర్తి చేశారు. దీనితో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులను శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒకే సమస్యతో వందలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దానిని ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి మరో 20 ప్రధాన భూ సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు వివరించారు.
పట్టా భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములు, 22-ఏ నిషేధిత జాబితా వంటి అంశాల్లో ఉన్న లోపాలను సరిచేస్తూ భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రీ-సర్వేలో పాస్ బుక్‌లు జారీకి ముందే ఆన్లైన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో భూ రికార్డులను పూర్తిస్థాయిలో సరిచేసి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా చేస్తున్నామని వివరించారు. చాలా సందర్భాల్లో ప్రజలు దరఖాస్తు చేయకముందే సుమోటోగా రికార్డులను పరిశీలించి తప్పులను సవరించడం జరుగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులులను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. చింతల ముని నగర్ భూ సమస్య పరిష్కారం జిల్లాలో భూ రికార్డుల సంస్కరణలో కీలక మైలురాయిగా నిలిచింది.













