రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి, అర్జీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడితేనే వారికి నిజమైన సంతృప్తి కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం కమిషనర్ చల్లా ఓబులేసు ఎఫ్‌సీఐ కాలనీ, ఎన్జీవో కాలనీ, వెంకటాద్రి నగర్ ప్రాంతాల్లో ప్రజలు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్జీదారులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. గుంతల పూడ్చివేత, వీధి దీపాల మరమ్మత్తులు, డ్రైనేజీ కాలువల నిర్మాణం వంటి పనులను తక్షణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తరువాత గణేష్ నగర్, శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. అక్కడి పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ, కాలువల శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌ను కూడా ఆయన తనిఖీ చేసి, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులు, ఉద్యోగులకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి అధికారి తమ దినచర్యలో ప్రజల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అర్జీదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా వినాలని ఆదేశించారు.
సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఆర్థిక పరిమితులు, ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన పనుల గురించి అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని కమిషనర్ సూచించారు. సమస్య పరిష్కారానికి కొంత సమయం అవసరమవుతుందని భావించి ఫిర్యాదును ముగించడం సరికాదని ఆయన తెలిపారు. తిరిగి ఫిర్యాదు పునరావృతం కాకుండా వాస్తవ స్థితిని ఫిర్యాదుదారుడికి స్పష్టంగా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల విషయంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ జనార్ధన్, శానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు హుస్సేన్, ఫరూక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.













