రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు : సాగు సీజన్ ప్రారంభమై, మరో వారం రోజుల్లో విద్యాసంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో రైతులు, విద్యార్థులు వివిధ ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దారు కార్యాలయాల కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓర్వకల్లు మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న ఓ గ్రామంలోని మీసేవ కేంద్రంలో ఆర్వోఆర్, అడంగల్ నకలుకు ఒక్కోదానికి రూ.150 వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తే అరగంటలోనే తహసీల్దారు కార్యాలయ ఆపరేటర్‌కు దరఖాస్తు నంబరు చెప్పి, తహసీల్దారు సంతకం లేకుండానే ధ్రువపత్రాలకు ఆమోదం పొందుతున్నట్లు ఆరోపిస్తున్నారు. కేంద్రం నిర్వాహకులు, తహసీల్దారు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు, వారి బినామీలు కలిసి వేల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానిక వర్గాలు అంటున్నాయి.
ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 150 మంది గ్రేడ్–2 వీఆర్వోలను గ్రేడ్–1 వీఆర్వోలుగా పదోన్నతి ఇచ్చి బదిలీ చేయడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో వీఆర్వో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారులు వీఆర్వో సంతకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో వార్డు సచివాలయ వీఆర్వోను రెండు, మూడు సచివాలయాలకు ఇన్ఛార్జిగా నియమించడంతో, జనగణన, బీఎల్వో విధులతో పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించడంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి దరఖాస్తుదారులపై మరింత భారంగా మారింది.
మీసేవ కేంద్రాల్లో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.50 రుసుము నిర్ణయించినా, నిర్వాహకులు రూ.70 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తు ఫారాలకే ఒక్కోదానికి రూ.10 నుంచి రూ.20 తీసుకుంటున్నారు. కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు తామే అధికారులతో సంతకాలు చేయించి ధ్రువపత్రాలు జారీ చేయిస్తామని చెప్పుకుంటూ, ఒక్కో ధ్రువపత్రానికి రూ.500, అత్యవసరమైతే రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మీసేవ నిర్వాహకులు, తహసీల్దారు కార్యాలయాల్లో ధ్రువపత్రాలు జారీ చేసే కంప్యూటర్ సిబ్బందితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని, దరఖాస్తు నంబరు చెప్పగానే అప్రూవల్ పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తహసీల్దారు కార్యాలయాల్లో కొద్దిమంది మాత్రమే అవుట్సోర్సింగ్ సిబ్బందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించగా, సుమారు 70 శాతం మంది ప్రైవేటు వ్యక్తులే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు నెలనెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అనధికారికంగా చెల్లిస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాల జారీ వంటి కీలక బాధ్యతలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంతో అవకతవకలకు ఆస్కారం పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు కూడా కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువపత్రాల జారీకి ధరలు నిర్ణయించి, ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుల నుంచి నేరుగా లేదా మధ్యవర్తుల ద్వారా వసూలు చేసే బాధ్యతను కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.













