జొన్నగిరిలో బంగారం గనులు :

నేటినుంచి తవ్వకాలకు శ్రీకారం

స్వాతంత్ర్యం తర్వాత దేశంలో తొలి గోల్డ్ మైన్

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం తవ్వకాల కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరీక్షణకు ముగింపు కాబోతోంది. తవ్వకాలు ప్రారంభంకానున్నాయి. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ప్రారంభమవుతున్న తొలి కొత్త గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో జొన్నగిరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగే అవకాశం ఉంది.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1994లో జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలను గుర్తించింది. అయితే భారీ పెట్టుబడులు అవసరమవడంతో ప్రాజెక్టు అమలు సంవత్సరాల పాటు నిలిచిపోయింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించడంతో ఆస్ట్రేలియాకు చెందిన జియో మైసూర్ సర్వీసెస్ రంగంలోకి దిగింది.

తుగ్గలి, మద్దికెర మండలాల్లో 1494.55 ఎకరాల విస్తీర్ణంలో జియో మైసూర్ సర్వీసెస్ సంస్థ సుమారు రూ.320 కోట్ల వ్యయంతో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 2021లో ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 2023లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు మార్గం సుగమమైంది.

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నిపుణుల సహకారంతో నిర్వహించిన వివిధ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో జొన్నగిరి గోల్డ్ మైన్ వాణిజ్య ఉత్పత్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం జియో మైసూర్‌లో 70 శాతం వాటాను భారతీయ సంస్థ త్రివేణి ఎర్త్ మొవర్స్ కొనుగోలు చేసింది. డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థకు 27.27 శాతం వాటా ఉంది. దీంతో ఆస్ట్రేలియా సాంకేతికత, భారతీయ పెట్టుబడుల కలయికగా ఈ గోల్డ్ మైన్ రూపుదిద్దుకుంది.

జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో గణనీయమైన ఆదాయం లభించనుంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 300 మందికి ఉపాధి కలగనుండగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగావకాశాలు సృష్టించబడనున్నాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నేటినుంచి తవ్వకాలు ప్రారంభం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. దీంతో జొన్నగిరి గోల్డ్ మైన్‌లో పూర్తి స్థాయి బంగారం వెలికితీత, ఉత్పత్తి ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి.

ప్రాజెక్టు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి: 1494.55 ఎకరాల విస్తీర్ణంలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు, రూ.320 కోట్ల పెట్టుబడితో నిర్మాణం, 2021లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, 2023లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం, స్వాతంత్ర్యం తర్వాత దేశంలో తొలి కొత్త గోల్డ్ మైన్‌గా గుర్తింపు, 300 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పైగా పరోక్షంగా ఉపాధి, రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, పన్నుల రూపంలో ఆదాయం, బుధవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం.