విస్తరణ పనులు నిలిచిపోవడంతో రహదారి గుంతలో ప్రాణాలు బలైపోతున్నాయి

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రహదారి విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గుంతలు, అడ్డంకులతో నిండిన కోడుమూరు - వెల్దుర్తి రహదారి మరోసారి ప్రాణాన్ని బలితీసుకుంది. వెంకటగిరి గ్రామానికి చెందిన నాగభూషి పెద్దగిడ్డయ్య (47) మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పెద్దగిడ్డయ్య, పని నిమిత్తం బుధవారం ద్విచక్రవాహనంపై కోడుమూరుకు వెళ్లారు. పనులు ముగించుకుని రాత్రి స్వగ్రామం వెంకటగిరికి తిరుగు ప్రయాణం అయ్యారు. కోడుమూరు - వెల్దుర్తి రహదారి విస్తరణ పనులు నిలిచిపోయిన కారణంగా మార్గమంతా గుంతలతో ప్రమాదకరంగా మారింది.

ఈ క్రమంలో రహదారిపై ఉన్న ఒక గుంతను తప్పించబోయి పెద్దగిడ్డయ్య ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స కోసం కోడుమూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కర్నూలుకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పెద్దగిడ్డయ్య మృతి చెందారు.

కోడుమూరు మండల పరిధిలో రహదారి విస్తరణ పనులు నిలిచిపోయిన కారణంగా ఇదే మార్గంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు వంతెన నిర్మాణం కోసం తీసిన గుంతలో ఇటీవల ఓ యువకుడు పడి మృతి చెందిన ఘటన ఇంకా మర్చిపోక ముందే, మళ్లీ మరో ప్రాణం బలైపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కోడుమూరు - వెల్దుర్తి రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనప్పటికీ, నిధుల సమస్యల కారణంగా పనులు ముందుకు సాగలేదని స్థానికులు చెబుతున్నారు. గతేడాది దాదాపు రూ. 20 కోట్ల వ్యయంతో పనులు మళ్లీ ప్రారంభమైనా, అవి కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా రహదారి పనులు పూర్తికాక, గుంతలు, అడ్డంకులు అలాగే ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.