రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: కర్నూలు జిల్లా పరిధిలోని 9 ICDS ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 77 ఖాళీలకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. వీటిలో 13 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 64 అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి.
అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డుల ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ ఆయా పోస్టుకు కనీస విద్యార్హత 7వ తరగతి పాస్‌గా నిర్ణయించారు. రెండు పోస్టులకూ దరఖాస్తు చేసుకునే మహిళలు వివాహితులై ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అభ్యర్థుల వయస్సు 1.7.2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండివుండి, గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే వారు దరఖాస్తు చేస్తున్న అంగన్వాడీ కేంద్రం ఉన్న అదే గ్రామంలో నివసించేవారై ఉండాలి. నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఖాళీల విభజన, కేంద్రాల వారీ వివరాల కోసం సంబంధిత CDPO కార్యాలయాలను సంప్రదించవచ్చు. ఆయా కార్యాలయాల నోటిస్ బోర్డులపై కూడా ఖాళీల వివరాలను ప్రదర్శించారు. అభ్యర్థులకు ముందస్తుగా తెలియజేస్తూ, ఈ ఖాళీలలో కొన్ని పోస్టులకు సంబంధించి గౌరవనీయ హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పోస్టుల్లో నియమించబడే అభ్యర్థుల నియామకాలు భవిష్యత్తులో వెలువడే కోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
మరిన్ని వివరాలు, పూర్తి నోటిఫికేషన్ కోసం సంబంధిత CDPOలు లేదా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి, కర్నూలు కార్యాలయాలను అభ్యర్థులు సంప్రదించవచ్చు.
దరఖాస్తు పత్రంతో పాటు అవసరమైన ధృవపత్రాల జిరాక్స్ ప్రతులను స్వయంగా సంతకం చేసి జతపరచాలి. పూర్తిగా నింపిన దరఖాస్తులను సంబంధిత CDPO, ICDS కార్యాలయాల్లో 05.08.2026 నుండి 13.08.2026 వరకు కార్యాలయ పనిదినాల్లో, కార్యాలయ పని వేళల్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ / చైర్మన్ జిల్లా ఎంపిక కమిటీ, కర్నూలు పర్యవేక్షణలో, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి P. Vijaya, A. Siri ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.













