రాయలసీమ న్యూస్, కర్నూలు:
కర్నూలులో చిన్న మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి: నీటి ఎద్దడి నేపథ్యంలో కమిషనర్ విజ్ఞప్తి
కర్నూలు నగరంలో వర్షాభావం, తాగునీటి ఎద్దడి పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితి పండుగను చిన్న మట్టి విగ్రహాలతోనే జరుపుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1 నుంచి 1.5 అడుగుల లోపు ఉండే చిన్న విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించి, స్థానికంగానే నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.
సోమవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో మున్సిపల్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత నీటి లభ్యత, వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు.
కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరంలోని సుమారు ఏడు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినాయక నిమజ్జనం కోసం తాగునీటిని వినియోగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.
కేసీ కెనాల్‌లోని వినాయక ఘాట్‌కు నిమజ్జనం కోసం నీటిని విడుదల చేసే అవకాశం లేదని కమిషనర్ పేర్కొన్నారు. సుంకేసుల, గాజులదిన్నె తదితర జలాశయాలు, ప్రాజెక్టుల్లో అదనపు నీరు అందుబాటులో లేదని వివరించారు. తుంగభద్ర ఎగువ ప్రాంతాలైన కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నప్పటికీ తుంగభద్ర జలాశయం ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో సుంకేసులకు అదనపు నీటి ప్రవాహం లేకపోయిందని తెలిపారు.
గతంలో సుంకేసుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో కలిపి సుమారు 3.64 టీఎంసీల నీటి లభ్యత ఉండేదని, ప్రస్తుతం వర్షాభావం కారణంగా నిల్వలు గణనీయంగా తగ్గాయని కమిషనర్ వివరించారు. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో సుమారు 1.561 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఈ నీటిని రోజుకు 40–45 క్యూసెక్కుల చొప్పున సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పంపిస్తూ నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తే నవంబర్ వరకు మాత్రమే సరిపోతుందని చెప్పారు.
హంద్రీ-నీవా ప్రధాన కాలువలో కూడా ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ఈ నెల 21వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత కాలువలో నీరు ఉండే అవకాశం లేకపోవడంతో అక్కడ కూడా వినాయక నిమజ్జనం నిర్వహించే పరిస్థితి లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. ఇళ్లలో, వీధుల్లో చిన్నపాటి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజల అనంతరం బకెట్లు, టబ్బుల్లోనే స్థానికంగా నిమజ్జనం చేసుకోవాలని కోరారు. పెద్ద విగ్రహాలను తీసుకురావద్దని, ఇప్పటికే ఆర్డర్ ఇచ్చి ఉంటే వీలైనంత వరకు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే పెద్ద గణనాథుని విగ్రహాలను తెచ్చుకున్న వారి కోసం ఐదు ప్రత్యేక మైదానాలను గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. సుంకేసుల రోడ్డులోని రైల్వే పట్టాల పక్కన, ఎంఆర్సీ ఫంక్షన్ హాల్ పక్కన, వెంకటరమణ కాలనీలోని పర్యాటక హోటల్ వెనుక ఖాళీ మైదానం, ఏ.క్యాంపు, జొహరాపురం ప్రాంతాల్లోని ఖాళీ మైదానాలను ఇందుకోసం పరిశీలించినట్లు పేర్కొన్నారు. పెద్ద విగ్రహాలను వచ్చే ఏడాది వరకు భద్రపరచుకునేలా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పండుగలోపు వర్షాలు కురిస్తే వర్షపు నీరు వృథా కాకుండా వినాయక ఘాట్ వద్ద నిల్వ చేసేందుకు అడ్డుకట్ట నిర్మిస్తున్నామని, వర్షాలు కురవకపోతే ఘాట్‌లో నిమజ్జనానికి సరిపడా నీరు ఉండదని కమిషనర్ తెలిపారు. వర్షాల కారణంగా తగినంత నీరు లభ్యమైతే నిమజ్జన ఏర్పాట్లపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తాగునీటి అవసరాలే అత్యంత ప్రాధాన్యమని, అందుబాటులో ఉన్న నీటిని ప్రజల తాగునీటి కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమిషనర్ పేర్కొన్నారు. నగర ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని నగరపాలక సంస్థకు, జలవనరుల శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో నగరపాలక ఎస్ఈ రమణమూర్తి, నీటిపారుదల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్ఈ జి. శైలేశ్వర్, హంద్రీ-నీవా సర్కిల్-1 ఎస్ఈ రాజన్ బాబు, హంద్రీ-నీవా డివిజన్-2 కార్యనిర్వహణ ఇంజినీర్ ఎన్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













