రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన అర్బన్ సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని జర్నలిస్టు జేఏసీ, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, నాలుగు స్తంభాల మండపం వద్ద ధర్నా చేపట్టి, అనంతరం ఆర్డిఓకు వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టు జేఏసీ, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి, నాలుగు స్తంభాల మండపం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కరణం నరేష్, లోక్ సత్తా పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు జయరాముడు, జర్నలిస్టు జేఏసీ నాయకుడు ఎం.సాల్ రంగడు తదితరులు మాట్లాడారు. అర్బన్ సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
విశాలాంధ్ర విలేఖరి ఎం.నాగరాజు వార్తా సేకరణ కోసం ఈ నెల 11వ తేదీన పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వెళ్లినప్పుడు, సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మెడ పట్టుకుని బయటకు గెంటివేసిన ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు సమాజంలో జరిగే మంచి, చెడు సంఘటనలను పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తారని, అలాంటి వృత్తి నిపుణులపై పోలీసు అధికారి ఇలా ప్రవర్తించడం అంగీకారయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు.
సీఐ జయన్న తన హోదాను మరిచి, జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, పత్రికల్లో రాయలేని రీతిలో దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. జిల్లా పోలీసు అధికారులు ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, సీఐ జయన్నపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తరువాత ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లి, ఆర్డిఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ఎం.రంగన్న, ఎం.రాముడు, సురేష్, సుల్తాన్, ఓబులేసు, రంగన్న, లక్ష్మీనారాయణ, పక్కీరప్ప, హనుమంతు, మధుబాబు, మధు గౌడ్, మంజునాథ్, షేక్షావలి, షఫీ, సుధాకర్, నాగేంద్ర, విజయ్, భార్గవ్, ఇమామ్, శివ, గౌస్, శివ శంకర్, బద్రీనాథ్, జాఫర్, మనోహర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, డి.రాజా సాహెబ్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కారన్న, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్ర కుమార్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్, వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి హేమంతు, ప్రజా సంఘాల ఇతర నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించారు.













