కర్నూలు నగరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల వివాదాలు పెద్ద ఎత్తున ఎస్పీ దృష్టికి వచ్చాయి. కర్నూలు నగరం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 132 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి వివరించి, లిఖిత పూర్వక ఫిర్యాదులను సమర్పించారు. వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మల్లికార్జున తన కుమారుడికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.3 లక్షలు తీసుకొని మోసం చేశాడని తుగ్గలి మండలం పగిడిరాయి కొత్తూరుకు చెందిన హరీష్‌చంద్ర ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన ఎస్పీకి వివరించినట్లు సమాచారం.

అలాగే, బెంగళూరుకు చెందిన మల్లు నవీన్‌కుమార్‌రెడ్డి అక్కడే ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఓర్వకల్లు మండలం గుట్టపాడుకు చెందిన హరికృష్ణ విన్నవించారు. ఉద్యోగ ఆశతో ఇచ్చిన డబ్బులు పోయి, ఉద్యోగం కూడా దక్కకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఎస్పీకి తెలియజేశారు.

కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వృద్ధులు కూడా ఎస్పీ వేదికను ఆశ్రయించారు. గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడుకు చెందిన 70 ఏళ్ల ఈరమ్మ తన ఇద్దరు కుమారులు, కుమార్తెలు తాను తినడానికి అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. వృద్ధాప్యంలో తాను అనుభవిస్తున్న కష్టాలను ఎస్పీకి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు.

ఆర్థిక లావాదేవీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రుణాలు, ఇతర లావాదేవీల పేరుతో ప్రజల నుంచి సుమారు రూ.6 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి స్వాహా చేసిన హరికుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంపాడుకు చెందిన నాగన్న, ఓంకార్‌లు ఫిర్యాదు చేశారు. తమ కష్టార్జిత సొమ్మును తిరిగి పొందేలా పోలీసు శాఖ జోక్యం చేసుకోవాలని వారు కోరినట్లు తెలిసింది.

ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ కోసం కూడా బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. సంపత్‌నగర్‌కు చెందిన నవీనాబేగం తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అతని ఆచూకీ కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత విభాగాల అధికారులకు పంపించి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా సూచనలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.